యాదాద్రి లోపాలు.. కేసీఆర్ ప్రతిష్ఠకు సవాలు!
Publish Date:May 6, 2022
Advertisement
ఒక్క వర్షం..ఒకే ఒక్క వర్షం యాదాద్రి పునర్నిర్మాణంలోని లోపాలను బట్టబయలు చేసేసింది. అంతా కేసీఆర్ ప్రచారార్భాటం తప్ప మరేం లేదని తేల్చేసింది. పైన పటారం..లోన లొటారంలో నిర్మణాలు లోపభూయిష్టంగా, నాసిరకంగా ఉన్నాయని జనం భావించేలా చేసింది. తెలంగాణ వెంకటాద్రిగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఇప్పుడు కేసీఆర్ ప్రతిష్ఠకే సవాలు విసురుతోంది. ఆలయ పునర్నిర్మాణ పనులలో లోపాలు, గుట్టపై అసౌకర్యాలు ఇప్పుడు ఆయన ప్రతిష్ఠను మసకబరిచేవిగా ఉన్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కేసీఆర్ ఆలయ పునర్నర్మాణాన్ని సంకల్పించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నంత కాలమూ, పునర్నిర్మాణం పూర్తై. ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించేంత వరకూ యాదాద్రిని కేసీఆర్ భూతల స్వర్గంగా తీర్చిదిద్దారన్న ప్రశంసలే వినిపించాయి. చూసేందుకు ఆలయం, ఆ పరిసర ప్రాంతాలూ ఇలలోనే అద్భుత సౌందర్య ప్రదేశాలలో ఒకటి అనిపించేవిగా ఉన్నాయి. మూడు ఘాట్ రోడ్డులతో యాదాద్రిని తిరుమల స్థాయిలో తీర్చిదిద్దారన్న ప్రశంసలే వినిపించాయి. అయితే ఒక సారి ఆలయ సందర్శనానికి భక్తుల రాక ప్రారంభమయ్యాకా గానీ కొండపై కష్టాలు తెలియలేదు. శౌచాలయాల కొరత, నీటి కొరతకు తోడు భక్తులకు నిలవడానికి నీడ లేని పరిస్థితి ఉంది. దీంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ విమర్శలేవీ కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేవిగా లేవన్నది వాస్తవం. కానీ ఎప్పుడైతే నిర్మాణ నాణ్యతలో లోపాలు బయటపడుతున్నాయో..సామాన్యుల నుంచి అందరూ కూడా వాటికి కేసీఆర్ కేంద్రంగానే విమర్శలు చేస్తున్నారు. నడి వేసవిలో వచ్చిన ఒక్క జడివానకే రోడ్డు కుంగిపోయి, చలువ పందిళ్లు కూలిపోయి, క్యూలైన్లు మునిగిపోయేంతగా యాదాద్రి వణికిపోయిందంటే..వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలను యాదగిరి గుట్ట తట్టుకు నిలబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఒక్క వర్షానికే ఘాట్ రోడ్డు దెబ్బతినడమే కాకుండా... అభివృద్ధిపనులలో లోపాలు బయటపడటంతో ప్రచారంపై ఉన్న శ్రద్ధ ఆలయ పునర్నిర్మాణ పనులపై కేసీఆర్ చూపలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. పునర్నిర్మాణ పనులు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పరిశీలన పేరిట అన్ని సార్లు సందర్శించిన ముఖ్యమంత్రి ఆ పనులలోని లోపాలు, లొసుగులపై ఎందుకు దృష్టి పెట్టలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి ఆలయ పనులలో లోపాలపై కేసీఆర్ స్పందించాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ లు వినవస్తున్నాయి. ఒక్క వర్షం..ఒకే ఒక్క వర్షం యాదాద్రిలోని లోపాలను, నాసిరకం నాణ్యతతో కూడిన నిర్మాణాలను బహిర్గతం చేశాయి. యాదాద్రి పునర్నిర్మాణానికి కర్తా, కర్మా, క్రియా అన్నీ తానేనని ప్రచారం చేసుకున్న కేసీఆర్ లక్ష్యంగానే సహజంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/yadadri-lapses-a-challange-to-kcr-prestige-25-135495.html





