నెల్లూరులో మరో అంబులెన్స్ మాఫియా.. జగన్ సర్కార్ ఏం చేస్తోంది?
Publish Date:May 5, 2022
Advertisement
జగన్ పాలనలో ఏపీలో మానవీయతకు నూకలు చెల్లినట్లు కనిపిస్తున్నది. అత్యాచారాలు, హత్యాచారాలు అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నా..వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా అంబులెన్స్ మాఫియా ఆగడాలు వెలుగులోకి వస్తున్నా..వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలూ కనిపించడం లేదు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంబులెన్స్ మాఫియా ఆగడం వెలుగు చూసింది. రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది తిరస్కరించడంతో.. గత్యంతరం లేక తన కుమార్తె మృతదేహాన్ని తండ్రి బైక్ పై తీసుకువెళ్లిన హృదయవిదారక సంఘటన నాయుడుపేటలో జరిగింది. ప్రమాద వశాత్తు క్వారీ గుంటలో పడిపోయిన చిన్నారిని వెలికితీసి ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆ చిన్నారి మృతదేహాన్నిఆసుపత్రి నుంచి ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది నిరాకరించారు. నిబంధనలు ఒప్పుకోవంటూ మొండికేశారు. ప్రైవేటు అంబులెన్సు కిరాయికి తీసుకునే ఆర్థిక స్థోమత లేని తండ్రి తన బైక్ పైనే తన కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు.
గత నెల 26న తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా ఇటువంటి సంఘటనే జరిగిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనలో కుమారుడి మృతదేహాన్ని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి తరలించేందుకు రుయా ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లు రూ. వేలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేని తండ్రి ఉచిత అంబులెన్స్ ను తెచ్చుకున్నా.. రుయా ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లు పడనివ్వలేదు. దీంతో చేసేది లేక ఆ తండ్రి తన కుమారుడి మృత దేహాన్ని బైక్ పై 90 కిలోమీటర్లు తన స్వగ్రామానికి తీసుకు వెళ్లారు. అలాగే ఈ నెల 1న మంచిర్యాలలో ఇటువంటి సంఘటనే జరిగింది. వలస కూలీ మృతదేహాన్ని తరలించేందుకు మంచిర్యాలలో అంబులెన్స్ డ్రైవర్లు ఏకంగా 80 వేల రూపాయలు డిమాండ్ చేశారు. యూపీకి చెందిన వలస కూలీ వడదెబ్బతో మరణిస్తే.. అతడి మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించి కుటుంబ సభ్యులకు కడసారి చూపు దక్కేలా చేద్దామని భావించిన అతడి బంధువులకు అంబులెన్స్ డ్రైవర్ల దురాశ శరాఘాతమైంది. అంత సొమ్ము ఇచ్చుకోలేక మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
కనీస మానవత్వం లేకుండా సొమ్ముకోసం గద్దల్లా పీడిస్తూ అంబులెన్స్ మాఫియా పెట్రేగిపోతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తున్నదని జనం ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడ మని ముఖ్యమంత్రి ఏడు కొండల స్వామిని వేడుకున్నారు. జనం మాత్రం ఈ పని చేయని ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడు తండ్రీ అని మొక్కుకుంటున్నామని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/another-ambulance-mafia-in-nellore-what-jagan-sarkar-is-doing-25-135493.html





