దేవుడా.. తెలంగాణకి కరెంటు కష్టాలు తీర్చవా...
Publish Date:Aug 22, 2014
Advertisement
దేవుడా... నేను తెలంగాణ రాష్ట్ర పౌరుణ్ణి. నువ్వంటే నాకు చాలా భక్తి. నీకు ఎన్నోసార్లు పూజలు, అభిషేకాలు చేశాను, చేయించాను. యధాశక్తి నిన్ను కొలుస్తున్నాను. ఇంతకాలం నేను నిన్ను నాకోసం ఎన్నెన్నో కోరికలు కోరాను. ఇప్పుడు నేను నాకోసం కాకుండా నా తెలంగాణ రాష్ట్రం కోసం నిన్ను ఓ కోరిక కోరుతున్నాను. ఓ సమస్య నువ్వే తీర్చాలని ప్రార్థిస్తున్నాను. ఇది ఏదో చిన్నాచితకా కోరికో సమస్యో అయితే అయితే నీదాకా వచ్చేవాణ్ణి కాదు. ఇప్పుడు నువ్వు తప్ప మరెవరూ తీర్చలేనంత పెద్ద సమస్యలో మా రాష్ట్రం చిక్కుకుపోయింది. ఆ సమస్య నుంచి నువ్వే ఎలాగైనా మా తెలంగాణని కాపాడాలి. మా తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి తక్కువ, వినియోగం ఎక్కువ కావడం వల్ల పరిస్థితి అంతా అయోమయంగా వుంది. మా హైదరాబాద్‌లోనే రోజుకి నాలుగైదు గంటలు కరెంట్ కట్ చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఆరు నుంచి ఏడు గంటల వరకు కరెంట్ కట్ చేయాల్సి వచ్చేట్టుంది. అదే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోజుకు పన్నెండు గంటలు కరెంట్ కట్ చేస్తున్నారు. కరెంట్ లేక తెలంగాణలో పరిశ్రమల్లో కార్మికులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారు. పవర్ లేక ప్రొడక్టివిటీ కూడా మందగించింది. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిపోయే ప్రమాదం వచ్చిపడింది. మా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అయితే జనం కరెంట్ కోసం రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేసేంతవరకూ పరిస్థితి వెళ్ళింది. మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణని కరెంట్ కష్టాల నుంచి బయటపడేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావట్లేదు. రాష్ట్రంలోని ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ దగ్గర కరెంట్ కొనాలంటే అక్కడా లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్ బోలెడంత వుంది. కానీ అక్కడి నుంచి కరెంటు తెచ్చుకోవడానికి లైన్లు మాత్రం అందుబాటులో లేవు. ఛత్తీస్‌ఘఢ్ నుంచి తెలంగాణకి కొత్త లైన్లు వేసి కరెంటు తెచ్చుకోవాలనేది మా సీఎం ఐడియా. అయితే ఆ ప్రాజెక్టు ఈరోజే అర్జెంటుగా మొదలుపెట్టేస్తే పూర్తవడానికి మూడేళ్ళపైనే పడుతుందట. మరి ఎప్పుడు మొదలు పెట్టాలి.. ఎప్పుడు పూర్తవ్వాలి.. ఈలోపు మా రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు వస్తున్న కరెంట్ కూడా ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే వర్షాలు లేక జల విద్యుత్ తాడు తెగేట్టుంది. ఇలాంటి పరిస్థితుల్లో మా తెలంగాణని కరెంటు కష్టాల నువ్వే కాపాడాలి.. సరేనా దేవుడా? పలకవేంటి దేవుడా? అదేంటి.. దేవుడి విగ్రహం మాయమైపోయింది.... అంటే మా తెలంగాణ కరెంటు కష్టాలు తీర్చడం దేవుడివల్లకూడా కాదా... ఇప్పుడెలా? అయ్యో.. మళ్ళీ కరెంట్ పోయింది..
http://www.teluguone.com/news/content/worst-power-crisis-grips-telangana-45-37505.html





