మెదక్: సీటు ఒక్కటే.. కర్చీఫ్‌లు బోలెడు..
Publish Date:Aug 22, 2014
Advertisement
కేసీఆర్ రాజీనామా చేసిన మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారు తమ తమ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో పార్టీల్లో పాతకాపులుగా వున్నవారితోపాటు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యమ నాయకులు, కోటీశ్వరులు ఉండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ స్థానం నుంచి పోటీ చేయడానికి దాదాపు ఓ డజనుమందికి పైగా ఉవ్విళ్ళూరుతున్నారు. గత ఎన్నికలలో కేసీఆర్ చేతిలో ఓడిపోయిన శ్రవణ్ కుమార్ ఈసారి కూడా తనకు టిక్కెట్ ఇస్తే సత్తా చూపిస్తానంటున్నారు. అలాగే అందోల్ నుంచి చతికిలపడిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ కూడా మెదక్‌లో గర్జిస్తానంటున్నారు. టీ జేఏసీ కన్వీనర్ కోదండరామ్‌ని రంగంలో నిలిపితే ఎలా వుంటుందన్న ఆలోచన కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు చేస్తున్నాయి. ఇక తాజాగా మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన జగ్గారెడ్డి మెదక్ సీటు నా జాగీర్ అన్నట్టుగా వున్నారు. ఇక పెద్దాయన జైపాల్ రెడ్డి అయితే అధిష్ఠానం తనను పిలిచిమరీ మెదక్ టిక్కెట్ ఇస్తుందన్న భరోసాలో వున్నారు. ఇక పేర్లు రాస్తే పెద్ద చాంతాడంత లిస్టు అయ్యేంతమంది కాంగ్రెస్ పార్టీలో మెదక్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ మెదక్ సీటు మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తనతో కలసి ఉద్యమం చేసిన స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్ ఎంచక్కా అసెంబ్లీలో సెటిలైపోయారు. తాను మాత్రం ఇంకా పదవి కోసం చకోర పక్షిలా చూస్తున్నానన్న ఆవేదనలో వున్నారు. కేసీఆర్ తనకు పిలిచిమరీ మెదక్ సీటు ఇస్తారన్న ఆశల్లో వున్నారు. అలాగే ఒక ట్రావెల్స్ అధినేత, ఒక నిర్మాణ సంస్థ అధినేత కూడా మెదక్ సీటు మీద కన్నేసి తమకున్న అర్థబలంతో ఆ సీటును సొంతం చేసుకోవచ్చని అనుకుంటున్నట్టు సమాచారం. మల్కాజిగిరిలో పోటీచేసిన మైనపల్లి హనుమంతరావు కూడా మెదక్ సీటు మీద ఆశలు పెట్టుకున్నారట. కోదండరామ్‌కి కాంగ్రెసోళ్ళు పిలిచి మెదక్ సీటు ఇచ్చేదేంటి.. మనమే ఇస్తే ఓ పని అయిపోతుంది కదా అని టీఆర్ఎస్‌లో కొంతమంది అనుకుంటున్నారట. ఇప్పుడు బీజేపీ కూడా మెదక్ సీటు గురించి సీరియస్‌గా ఆలోచిస్తోంది. మొన్నటి వరకూ జగ్గారెడ్డి బీజేపీలోకి వస్తారు.. మెదక్ సీటు నుంచి పోటీ చేస్తారు అనే ఊహాగానాలు వినిపించాయి. జగ్గారెడ్డికి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని కూడా ప్రచారం జరిగిపోయింది. అయితే ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మెదక్ సీటు నుంచి ఎవరో అల్లాటప్పా అభ్యర్థిని నిలబెట్టడం కంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డినే నిలబెడితే తప్పకుండా తెలుస్తామన్న అభిప్రాయాలు బీజేపీలో వున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా మెదక్ స్థానాన్ని ఎలాగైనా సరే బీజేపీ సొంతం చేసుకోవాలని భావిస్తు్న్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ని తీవ్రంగా వ్యతిరేకించి పార్టీలోంచి బయటకి వచ్చేసిన రఘునందన్ కూడా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా బీజేపీలో చేరిన మాజీ డీజేపీ దినేష్ రెడ్డి గడచిన ఎన్నికలలో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోతారు. ఇప్పుడు ఆయన మెదక్ స్థానం మీద ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద మెదక్ పార్లమెంట్ సీటు మాత్రం ఒక్కటే వుంది.. కర్చీఫ్‌లు మాత్రం చాలానే వున్నాయి.
http://www.teluguone.com/news/content/medak-parliament-constituency-parties-and-candidates-45-37507.html





