పొదిలిలో జగన్ కు నిరసనల సెగ!
Publish Date:Jun 11, 2025
Advertisement
జగన్ పొదిలి పర్యటన రసాబాసగా మారింది. పోగాకు వేలం కేంద్రం సందర్శన అంటూ పొదిలిలో పర్యటించిన జగన్ కు నిరసనల సెగ గట్టిగా తగిలింది. జగన్ సొంత మీడియా చానెల్ లో అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా జర్నలిస్టు కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు, వాటికి సాక్షి ఉద్యోగి, మరో సీనియర్ జర్నలిస్టు అయిన కొమ్మినేని శ్రీనివాసరావు వంత పాడినట్లుగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. మరో జర్నలిస్టు కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. హైకోర్టులు ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో జగన్ పొదిలి పర్యటనకు బయలుదేరారు. దీంతో ఆయన పర్యటన పొడవునా నిరసనలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో జనం ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. షేమ్ షేమ్ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. నల్లబెలూన్లు ప్రదర్శించారు. జగన్ సొంత మీడియా చానల్ లో ప్రసారమైన అసభ్య వ్యాఖ్యలను ఖండించకపోవడమే కాకుండా, ఆ వ్యాఖ్యలు చేసిన వారిని సమర్ధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మౌనం వీడాలి, జగన్ రాష్ట్రం వీడాలి అంటూ నినాదాలు చేశారు. అలాగే భారతీరెడ్డి మౌనం వీడాలి అంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అలా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వైసీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకల దాడిలో కొందరు మహిళలు గాయపడ్డారు. అలాగే రాళ్లదాడిలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. సరే ఎలాగో పొగాకు వెలం కేంద్రానికి జగన్ వెళ్లారు. అక్కడ ఆవుకథలాంటి ప్రసంగం చేశారు. అయితే వైసీపీ మూకల హంగామా పొగాకు రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. వైసీపీ శ్రేణులు పోగాకుబేళ్లను తొక్కుతూ నానా హంగామా చేసి రైతులకు నష్టం కలిగేలా ప్రవర్తించారు. ఇక పొగాకు రైతులను ఉద్దేశించి జగన్ తనదైన మార్క్ ప్రసంగం చేశారు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులకు అండగా ఉంటానన్నారు.
http://www.teluguone.com/news/content/women-protests-in-podili-against-jagan-25-199708.html





