ఇంతకీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు ఎప్పుడంటే?
Publish Date:Aug 16, 2025
Advertisement
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే ఎన్డీయే అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతను కూటమి పార్టీలు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు అప్పగించాయి. దీంతో మోదీ, షాలు ఎవరిని ఖరారు చేస్తారన్నది ఇప్పటి వరకూ ఎవరికీ అంతుచిక్కడం లేదు. రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నా.. మోడీ షాల మదిలో ఎవరున్నారన్నది ప్రకటన వెలువడే వరకూ ఎవరికీ తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ సస్పెన్స్ ఒక్క కూటమి పార్టీలలోనే కాదు కాంగ్రెస్ లో కూడా ఉంది. ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది తేలిన తరువాత కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని నిలబెట్టాలా? వద్దా? ఒక వేళ నిలబెడితే ఎవరిని అన్నది తేల్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 17) జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎవరన్నది తేలుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. అయితే పరిశీలకులు మాత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగుతుందనీ, అయితే అభ్యర్థి ఎంపిక బాధ్యత మాత్రం మళ్లీ మోడీ, షాలకు అప్పగిస్తుందనీ అంటున్నారు. ఇక మోడీ, షా ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును సోమవారం (ఆగస్టు 18)న ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి దన్ ఖడ్ ఉపరాష్ట్రపతి పదవిని చేసిన రాజీనామా ఆమోదం పొందిన క్షణం నుంచీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అంటూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే ఫైనల్ గా ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అన్న ఫైనల్ డెసిషన్ మాత్రం ఇంత వరకూ జరగలేదు. అయితే ఈ సస్పెన్స్ మరెంతో కాలం కొనసాగే అవకాశం లేదు. ఉపరాష్ట్రపదవికి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ కావడంతో సోమ, లేదా మంగళవారం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్ని పేర్లు తెరమీదకు వచ్చినా ఫైనల్ గా అభ్యర్థిని డిసైడ్ చేసేది మాత్రం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే అనడంలో సందేహం లేదు.
http://www.teluguone.com/news/content/when-will-be-the-nda-vicepresident-candidate-finalisation-39-204375.html





