దావోస్ లో కేటీఆర్, జగన్ భేటీ.. చీకటి ఒప్పందాల కోసమేనా?!
Publish Date:May 24, 2022
Advertisement
దావోస్ వేదికగా కేటీఆర్, జగన్ ల భేటీ రాజకీయ వర్గాలలో పెద్ద ఆశ్చర్యం కలిగించదు కానీ.. సామాన్య జనం మాత్రం ఇదేదో ఎనిమిదో వింత అన్నట్లు నిబిడాశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. జగన్, కేటీఆర్ లు అంత ఆత్మీయంగా పలకరించుకోవడమేమిటి? అని నిర్ఘాంత పోతున్నారు. నిన్న గాక మొన్న ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో కేటీఆర్ హైదరాబాద్ వేదికగా ఒక బిజినెస్ సదస్సులో కుండ బద్దలు కొట్టారు. దానిపై వైసీపీ నేతలు, మంత్రులు భగ్గుమన్నారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ అని నిలదీశారు. తెలంగాణలో కంటే ఆంధ్రలోనే అభివృద్ధి భేషుగ్గా ఉందని దబాయించారు. ఎన్నికల ముందు ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటును మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలోనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్, వైసీపీలకు ప్రజలలో ఆ సెంటిమెంట్ సజీవంగా ఉండటం అవసరం కనుకనే ఇరు పార్టీలూ కూడబలుక్కునే ఈ వివాదాన్ని లేవనెత్తయని అప్పట్లోనే రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. ఆతరువాత అంతా మామూలే. ఇప్పుడు దావోస్ వేదికగా టీఆర్ఎస్, జగన్ లు కలవడం అందుకే రాజకీయ వర్గాలలో పెద్దగా చర్చ జరిగే అవకాశం లేదు. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై, ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపిస్తుండటం... అలాగే కేంద్రం కూడా తెలంగాణ పట్ల ఒకింత వ్యతిరేక ధోరణి కనబరచడం, అదే సమయంలో కేసీఆర్ అవినీతి కోట బద్దలౌతోందనీ, ఆయన త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమనీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు బండి పదే పదే సభలు, సమావేశాలలో చెబుతుండటంతో ఏదో జరగబోతోందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. అలాగే కేంద్ర ఆర్థిక శాఖలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేసీఆర్ అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయి. ఈ సమాచారం కేసీఆర్ కు కూడా లీక్ కావడంతోనే ఆయన నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారని ఆ వర్గాల భోగట్టా. ఈడీ సోదాల నుంచీ, సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకోవడమెలా అన్న విషయంపై కేసీఆర్ జగన్ సలహా, సూచన తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ, ఏపీ, తెలంగాణలలో జగన్ తో భేటీ అయితే జనాలకు తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశాలున్నాయన్న శంకతోనే ఈ భేటీ వేదికను దావోస్ ఎంపిక చేసుకున్నారంటున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున సిఫారసులతో కేటీఆర్ దావోస్ కు ఆహ్వానం అందేలా చేసుకున్నారనీ అంటున్నారు. ఈ సలహా, సూచనలకు జగనే ఎందుకంటే అన్న ప్రశ్నకు కూడా పరిశీలకులు విశ్లేషణాత్మక వివరణలు ఇస్తున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొంటున్న జగన్ వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, విచారణ జాప్యం అవ్వడానికి ఏం చేయాలి అన్న విషయంలో విలువైన సహకారం అందించగలరన్నది కేసీఆర్ నమ్మకంగా చెబుతున్నారు. అందుకే జగన్ తో భేటీకి కేటీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారని అంటున్నారు. కేసీఆర్ అడగ్గానే జగన్ కేటీఆర్ తో భేటీకి అంగీకరించడానికి కూడా కారణముందంటున్నారు. గత ఎన్నికలలో ఏపీలో జగన్ అధికారంలోనికి వచ్చేందుకు అన్ని విధాలుగా కేసీఆర్ ‘సహాయ సహకారాలు’ అందించడంతో ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంతోనే జగన్, కేటీఆర్ లు ఇరువురూ కూడా దావోస్ లో పెట్టుబడుల వేట కంటే పరస్పర భేటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-the-reason-for-ktr-jagn-meet-in-davoos-25-136359.html





