ముర్ము తెలంగాణ పర్యటన రద్దు కారణమేంటి?
Publish Date:Jul 14, 2022
Advertisement
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన అర్ధంతరంగా రద్దైంది. రద్దుకు కారణం వర్షాలు అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే అదే రోజు ఆమె ఏపీలో పర్యటించారు. అధికార, విపక్ష నేతలను కలిశారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. విపక్ష నేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ భేటీకి ఏపీ బీజేపీ నాయకులు సైతం హాజరయ్యారు. ఈ భేటీ ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలపై ఊహాగానాలకు సైతం తెరలేపింది. ఈ భేటీ అధికార వైసీపీని కంగుతినింపించింది. అదలా ఉంచితే.. ఏపీ కూడా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పరిస్థితే ఉంది. అయినా ముర్ము ఏపీలో పర్యటించారు. అదే సమయంలో అదే రోజు జరగాల్సిన తెలంగాణ పర్యటనను మాత్రం రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఏపీ నుంచి తెలంగాణకు రావడానికి ముర్ముకు వాయు మార్గంలో గంట సమయం కూడా పట్టదు. అంతే కాకుండా గన్నవరం విమానాశ్రం నుంచి ఢిల్లీకి వెళ్లడం కంటే హైదరాబా నుంచి హస్తిన యానం సులువు. అయినా కూడా ఆమె తెలంగాణకు రాలేదు. తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. అందుకు కారణమేమై ఉంటుందన్న దానిపై పరిశీలకులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలో ఆమె పర్యటనకు ముందే.. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు ముర్ముకు తమ మద్దతు ప్రకటించేశాయి. అయినా ఆమె ఏపీలో షెడ్యూల్ ప్రకారం పర్యటించారు. అధికార, విపక్ష నేతలతో బేటీ అయ్యారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో బీజేపీ మద్దతు ఎలాగూ ముర్ముకే. ఇక అధికార టీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థికే తన మద్దతు అని ప్రకటించడమే కాకుండా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు ఆహ్వానించారు. నగరంలో ఆయన రాక సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. మీటింగ్ ఏర్పాటు చేసి ఆర్బాటం చేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ మద్దతు ఎలాగూ విపక్షాల ఉమ్మడి అభ్యర్థికేనన్న సంగతి విదితమే. అలాగే ఎంఐఎం పరిస్థితి కూడా. ఇక పోతే ముర్ము తెలంగాణ పర్యటనలో కలవగలిగేది, మద్దతు కోరగలిగేది ఒక్క బీజేపీని మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ పర్యటనకు వచ్చినా తనను ప్రతిపాదించిన బీజేపీ సభ్యులు తప్ప మరే పార్టీ నుంచీ మద్దతుదొరకదు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగా పర్యటనను రద్దు చేసుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక టీఆర్ఎస్ అయితే తెలంగాణలో మద్దతు కూడగట్టడం సాధ్యం కాదని తేలిపోవడంతోనే ఆమె రాష్ట్ర పర్యటను రద్దు చేసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం నుంచి బీజేపీకి ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న ఓట్లు బహుస్వల్పం. సో రాష్ట్ర బీజేపీ సభ్యులను ఇక్కడ కలిసి మద్దతు కోరడం కంటే హస్తినకు రప్పించుకుని మాట్లాడడమే బెటర్ అని భావించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-the-reason-behind-murmu-telangana-tour-39-139746.html





