అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి ? ఎందుకు ఇంత ఆందోళన ?
Publish Date:Aug 5, 2019

Advertisement
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఏమిటి ? ఇది రద్దు చేస్తామని కేంద్రం అంటే ఎందుకు ఇంత వివాదాస్పదం ఎందుకవుతోంది ? అనేది తెలియాలి అంటే అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్రం హోదాను ఇస్తుంది.
1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు మిగిలిన సంస్థానాలన్నీ దేశంలో విలీనం అయ్యాయి. కానీ కశ్మీర్ మహారాజు హరి సింగ్ మాత్రం విలీనానికి అంగీకరించలేదు. తర్వాత పాకిస్థాన్ నుంచి ముప్పు తప్పదని అర్థమయ్యాకే షరతుల మీద కశ్మీర్ ను భారత్‌లో విలీనం చేయడానికి ఒప్పుకొన్నారు. 1947 చివర్లో నాటి ప్రధాని నెహ్రూ, కశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లా కలిసి ఐదు నెలలపాటు చర్చించి ఆర్టికల్ 370ని రూపొందించారు.
అప్పటికే కశ్మీర్‌లో మూడోవంతు భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించడంతో ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని నెహ్రూకు గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ సూచించాడు. అయితే ఆర్టికల్ 370 ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. జమ్ము-కశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో, కమ్యూనికేషన్ విషయంలో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది. కానీ రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే డిమాండ్ వచ్చింది.
1951లో రాష్ట్రాన్ని, రాజ్యాంగ అసెంబ్లీని ప్రత్యేకంగా పిలవడానికి అనుమతి లభించింది. 1956 నవంబర్‌లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తైంది. 1957 జనవరి 26న రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలైంది. ఆర్టికల్ 370లోని నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్ము-కశ్మీర్ రాష్ట్రంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు. ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాదికారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదు, సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు.
జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది కానీ పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది. ఇక్కడ RTI చట్టాలు పనిచేయవు, కాగ్ కి కూడా ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు.
http://www.teluguone.com/news/content/what-is-article-370-in-indian-constitution--39-88496.html












