ఈటలతో అమిత్ షా భేటీ అందుకేనా?
Publish Date:Jun 20, 2022
Advertisement
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో సందేహం లేదు. బీజేపీ, ముఖ్యమంత్రి కేసీఆర్’తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేప్రయత్నం చేస్తోందని, కొంత ప్రచారం జరిగినా, మెల్ల మెల్లగా సీన్ మారి పోయింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించడంతో, బెంగాల్ తరహాలోనే బీజేపీ తెలంగాణ పై దృష్టిని కేంద్రీకరించిందనే విషయం స్పష్టమైంది. మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే, గుజరాత్ వంటి రాష్ట్రాల కంటే, ఎన్నికలకు సంవత్సరం పైగా సమయమున్న తెలంగాణ పై, బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర కీలక నేతలు రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మరో వంక తెర వెనక నుంచి చక్రం తిప్పే సంఘ్ పరివార్ నేతలు రాష్ట్రంలో తిష్టవేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సంఘ్ పెద్దలకు, పార్టీఅధిష్టానానికి అందచేస్తున్నారని, తదనుగుణంగా కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, పార్టీ వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే, ఇప్పుడు, మరో పది రోజుల్లో, హైదరాబాద్’లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగతున్న సమయంలో, మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఇటు రాజకీయవర్గాల్లో అటు పార్టీ వర్గాలో చర్చనీయాంశమైంది. ఈటలను హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు పిలిచారు? ఆయనకు కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈటలకు ప్రత్యేక పీఠం వేసేందుకే, అమిత్ షా ఆయన్ని ఢిల్లీ పిలిపించి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించిన నేపధ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు, ఈటలకు జాతీయ స్థాయిలో పదవి ఇస్తారా? లేక రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా, అనే విషయంలో విభిన్న అభిప్రాయలు వ్యక్త మవుతున్నాయి. గత కొంత కాలంగా ఓ వంక ఈటల కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది, మరో వంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మరుస్తారనే ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే, బండి సంజయ పాద యత్ర ముగుంపు సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా, స్వయంగా బహిరంగ వేదిక నుంచి బండి సంజయ్ ని ప్రశంసలతో ముంచెత్తి, ‘మార్పు’ ప్రచారానికి తెర దించారు. ఏ నేపధ్యంలో ఈటలకు ఏ పదవి ఇస్తారు? ఏ బాధ్యతలు అప్పగిస్తారు అనే విషయంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవికి సమన హోదా కల్పిస్తూ పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా? లేక వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పదవి కట్టబెట్టబోతున్నారా? అన్నది చర్చనీయాంశమైంది. అయితే పదవి ఏదైనా, బీజేపీలో బయట నుంచి వచ్చిన వారికి సముచిత స్థానం లభించదు అన్న అపవాదును తొలిగించే విధంగా ఈటల సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుందని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు, తెలుగు వన్ కు చెప్పారు. తెరాస సహా ఇతర పార్టీలలోని కీలక నేతలు కొందరు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నా, ఒకసారి చేరిన తర్వాత, పార్టీలో తమ స్థానం ఏమిటి? అనే ప్రశ్న దగర ఆగిపోతున్నారు, అందుకే, పార్టీ అధినాయకత్వం ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించాలానే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. ఇందుకోసంగానే. డాక్టర్ కే.లక్ష్మణ సహా పార్టీ పాత కాపులకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈటలకు రాష్ట్ర స్థాయిలోనే కీలక బాధ్యతలు అప్పగించవచ్చన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.అయితే, బీజేపీ నాయకత్వం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అనే దాని పైనే, ఈటల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-amith-sha-strategi-behind-meeting-with-etala-25-138022.html





