నష్టనివారణా.. జగన్ అరెస్టు ఖాయమన్న సంకేతమా?
Publish Date:Jul 26, 2025
Advertisement
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది. దాని కంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వరుసగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ భయాన్ని ఎత్తి చూపుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీ అంత వరకూ ప్రదర్శిస్తూ వస్తున్న గాంభీర్యం లేదా మేకపోతు గాంభీరం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. పొంతన లేని ప్రకటనలతో పార్టీలో నెలకొన్న అయోమయాన్ని బహిర్గతం చేసుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో సజ్జల బయటకు వచ్చి వైసీపీ అనుకూల మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూల సారాంశం ఏమిటన్న దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత నష్టనివారణ, క్యాడర్ లో ధైర్యాన్నినింపడం ఎజెండాగా సజ్జల మాట్లాడిన మాటలు క్యాడర్ లో ధైర్యం నింపడం సంగతి అటుంచి క్యాడర్ ను మరింత గందరగొళంలోకి నెట్టేశాయి. మొత్తంగా సజ్జల మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న సంకేతం ఇచ్చారు. జగన్ అరెస్టు కు క్యాడర్ ను సంసిద్ధం చేయడమే ఆయన ఇంటర్వూల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో సజ్జల సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన నాడు అన్ని శాఖలపైనా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఈ ఏడాది కాలంలో ఆయనకు పనేమీ లేకుండా పోయింది. అయితే మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ అరెస్టును, ప్రభుత్వ తీరును ఖండిస్తూ పార్టీని సమర్ధించుకోవలసిన బాధ్యత ఆయనపై పడింది. ఆ పనిని ఆయన చేయగలిగినంత అస్తవ్యస్తం చేస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకే కంగారుపడితే ఎలా? ముందు ముందు జగన్ కూడా ఈ కేసులో కటకటాల వెనక్కు వెడతారు.. అంటే ఆయన పార్టీ క్యాడర్ కు సంకేతాలిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చి తొలి ఏడాది ఎవరినైనా అరెస్టు చేయడం సులువే.. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అదే జగన్ అన్ని ఆధారాలూ సేకరించిన తరువాత తన అధికారం చివరి దశలో చంద్రబాబును అరెస్టు చేశారని గుర్తు చేశారు. అయితే ఇక్కడ సజ్జల ఉద్దేశపూర్వకంగా విస్మరించిన సంగతేంటంటే.. జగన్ ప్రభుత్వం అన్ని ఆధారాలూ సేకరించి చంద్రబాబునున అరెస్టు చేసినట్లైతే.. ఆ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంలో విఫలం ఎందుకైంది? అన్న ప్రశ్నకు సమాధానం. మొత్తంగా నష్టనివారణ అంటూ మీడియా ముందుకు అదీ జగన్ అనుకూల మీడియా ముందుకు వచ్చి సజ్జల చెప్పిందేమిటంటే.. జగన్ మద్యం కేసులో అరెస్టు కాబోతున్నారు అనే.
http://www.teluguone.com/news/content/what-did-sajjala-say-45-202779.html





