తీరు మారని ట్రంప్... ప్రపంచ దేశాలకు మళ్లీ యూఎస్ వార్నింగ్
Publish Date:Aug 26, 2025
Advertisement
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా మరోసారి ఆయన ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా టెక్ సంస్థల నుంచి డిజిటల్ పన్నులు వసూలు చేసే దేశాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గట్టివార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా దేశాలకు అమెరికా నుంచి కంప్యూటర్ చిప్స్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఆల్ఫబెట్, మెటా, అమెజాన్.. వంటి అమెరికా కంపెనీలపై డిజిటల్ పన్నులు, ఇతర ఆంక్షలు పెట్టే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేసే దేశాలకు ఎదురొడ్డి నిలబడతామని అన్నారు. డిజిటల్ ట్యాక్స్‌లు, డిజిటల్ సర్వీస్ చట్టాలు, డిజిటల్ మార్కెట్ నియంత్రణలు అన్నీ అమెరికా కంపెనీలపై వివక్ష చూపించేందుకు రెడీ చేశారని విమర్శించారు. చైనా కంపెనీలకు మాత్రం ఈ దేశాలు ఎలాంటి అడ్డంకులు కల్పించట్లేదని, పద్దతి మార్చుకోవాలని సూచించారు. అలాంటి దేశాలను అప్రమత్తం చేస్తున్నానని, అమెరికా కంపెనీలు మీకు కాళ్లు తుడుచుకునే డోర్ మ్యాట్స్ వంటివి కావని, అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ప్రపంచ దేశాలపై మండిపడ్డారు. డిజిటల్ పన్నుల విషయంలో అమెరికా కెనడాపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న విషయం తెలిసిందే. కెనడాతో వాణిజ్య పరంగా తెగదెంపులు చేసుకుంటామని జూన్‌లో గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ఈ అంశాల్లో ఈయూ మాత్రం అమెరికా అనుకూల ధోరణితో ముందుకు వెళుతోంది. ఇలాంటి వాణిజ్య అడ్డంకులు తొలగింపునకు కలిసి పనిచేస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య ఓ సంయుక్త ప్రకటన చేశాయి. ఎలక్ట్రానిక్ ప్రసారాలపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీలు విధించబోమని పేర్కొన్నాయి. నెట్‌వర్క్ యూసేజీ ఫీజులను కూడా విధించబోమని కూడా ఐరోపా సమాఖ్య పేర్కొంది. ప్రస్తుతం అనేక దేశాల ప్రభుత్వాలు అమెరికన్ కంపెనీల నుంచి సగటున 3 శాతం వరకూ పన్ను వసూలు చేస్తున్నాయి. అమెరికా కంపెనీలు ఆయా దేశాల్లో పొందుతున్న ఆదాయంపై ఈ పన్ను విధించాయి. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/donald-trump-45-205042.html





