బావిలో పడిన సూది దొరుకుతుందా?.. ఢిల్లీ లిక్కర్ స్కాం తేలుతుందా?
Publish Date:Jan 16, 2023
Advertisement
చిన్న పిల్లలకు తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలూ తరచుగా చెప్పే కథ ఒకటుంది.. అనగనగా ఓ ముసలవ్వ నూతి గట్టుపై కూర్చుని బొంత కుట్టుకుంటుంటే..సూది బావిలో పడిపోయింది.. ఏం చేస్తే ఆ సూది బయటకు వస్తుంది అని. పిల్లల్లో ఊహాశక్తిని పెంచేందుకు ఈ కథ చెబుతారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం ప్రజలలో నిరాసక్తత, నిర్లిప్తతను నింపేయడానికి దాదాపు ఆ కథనే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఔను నిజమే.. దేశంలో జరగుతున్న కుంభ కోణాలు, వాటి దర్యాప్తుల విషయంలో జనం ఈ దర్యాప్తు కొలిక్కి వస్తుందా? రాదా? అని ప్రశ్నించే అవసరం లేకుండా కొనసాగుతుంది అన్న జవాబును వారికి ముందే చెప్పేస్తున్నారు. అసలు దర్యాప్తులకు రాజకీయాలకు, ప్రభుత్వాలకూ సంబంధం ఏమిటంటారా? ఆ సంబంధం ఏమిటో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంగా చెప్పేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల రిమోట్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుందనీ, అలాగే రాష్ట్రాల దర్యాప్తు సంస్థల రిమోట్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని. నిజమే.. ఎమ్మెల్యేల కొనుగోలు బేర సారాల కేసును సిట్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో ఆయన ‘ మీ చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మా దర్యాప్తు సంస్థలు మాకున్నాయి అని కేంద్రానికి తేల్చి చెప్పారు. ఆ సందర్భంగానే ఆయన ఈ మాటలు ఎందుకన్నారో అందరికీ తేటతెల్లమైపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ, స్వయంగా తన కుమార్తె కల్వకుంట్ల కవితపై ఆరోపణలు రావడం, ఆమెను ఈడీ, సీబీఐ విచారించడం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అంటే చట్టం, న్యాయం, ధర్మం కంటే కేసులు దర్యాప్తుల విషయంలో రాజకీయానిదే కీలక పాత్ర అని ఆయన స్వయంగా చెప్పేశారన్నమాట. ఓ వంక ఢిల్లీ లిక్కర్ స్కాంలో సూత్రదారులు, పాత్ర దారులు ఎంతమంది ఉన్నా, తెలంగాణకు సంబంధించినంతవరకు, ఫోకస్ మొత్తం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చుట్టూనే తిరుగుతోంది. కవిత కేంద్రంగానే సిబిఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. నిజానికి, ఈ స్కాంలో కవిత పేరు చాలా కాలంగా వినిపిస్తున్నా డిసెంబర్ మొదటి వారం వరకు ఆమె ప్రమేయం గురించి, ఈ కేసును విచారిస్తున్న సిబిఐ, ఈడీ ఎక్కడా అధికారికంగా ప్రస్తావించలేదు. అయితే ఆ తర్వాత, కదలిక మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై అమిత్ అరోరాని ఈడీ అరెస్ట్ చేసింది. అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్ గా శరత్ చంద్ర, కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో సిబిఐ కవితకు 160 సీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చింది. డిసెంబర్ 11,12 తేదీల్లో సిబిఐ అధికారులు కవితను ఆమె నివాసంలోనే విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబందించిన వివరాలను సేకరించారు. ఆ తర్వాత మళ్ళీ స్వల్ప విరామం తరువాత మళ్ళీ ఇంకోసారి విచారణకు హజరుకావాలని 91 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించారు. ఐతే ఈసారి కవిత నివాసంలో కాకుండా.. తాము చెప్పిన చోటుకు వచ్చి.. విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు తాము అడిగిన పత్రాలను సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎవరు నోటీసులు అందుకుంటే వాళ్లు మాత్రమే హాజరుకావాలని వెల్లడించారు. కేసుకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లకు సంబంధించి సమాచారం కావాలని.. కావాల్సిన పత్రాలు, సాక్షాలు ఇవ్వాలని కోరారు. విచారణ తేదీ, స్థలాన్ని త్వరలోనే మెయిల్ చేస్తామని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసు వచ్చి నెల రోజులు దాటి పోయింది. అయినా ఇంతవరకు అటు నుంచి గానీ, ఇటు నుంచి గానీ ఉలుకూ పలుకూ లేదు. ఇంతలోనే ఎమ్మెల్యేల బేరసారాల (ఫార్మ్ హౌస్) కేసు తెరపై కొచ్చింది ఈ కేసుకు సమందించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు విచారణార్హత లేదని హై కోర్టు తేల్చేసింది. కేసును సిబిఐకి బదిలీ చేయాలని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిట్ విచారణపై అనుమానాలు వ్యక్త చేసింది..ముఖ్యంగా ఈ వ్యవహారం ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం వెలుగు చూసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను వెల్లడించడాన్ని ప్రస్తావించిన హైకోర్టు..సీఎం కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని పేర్కొంది. సో ... ఎమ్మెల్యేల బేరసరాల కేసు అటుతిరిగి ఇటు తిరిగి ప్రగతి భవన్ కు చేరుకుందని అనుకుంటున్నారు. సరే హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసిందనుకోండి అది వేరే విషయం. కానీ కవిత కు లిక్కర్ కేసులో ఇచ్చిన నోటీసుల విషయం ఏమిటి? ఆమెను నోటీసులుఇచ్చి నెలరోజులైనా విచారణకు ఎందుకు పిలవలేదు? కవిత లిక్కర్ కేసుకు సంబందించి, సిబిఐ,ఈడీ మౌనం వెనుక ఉన్న మతలబు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం మళ్లీ బావిలో పడిన సూది కథలాగా మారుతుంది. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న కేసుల విషయంలో ఇవన్నీ మామూలే అని చెబుతున్నారు. అయితే అటు లిక్కర్ కేసు, ఇటు ఎమ్మెల్యేల బేరసారాల కేసులలో రాజకీయ ప్రమేయం ఉన్న నేపధ్యంలో ఈ కేసులు ముందుకు సాగడం, సాగకపోవడం అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-about-notieces-to-kavita-in-liquor-scam-39-150038.html





