విరాటుడి సెంచరీల వేట.. లంకతో మూడో వన్డేలో చెలరేగిన కోహ్లీ
Publish Date:Jan 15, 2023
Advertisement
కోహ్లీ మళ్లీ సెంచరీల వేటలో పడ్డాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు సెంచరీ కోసం ఎదురుచూసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు పరుగుల వరద పారిస్తున్నారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. లంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో శతక బాదిన రన్ మెషిన్ ఆదివారం(జవనరి 15) తిరువనంతపురం వేదికగా మూడో వన్డేలో మరో శతకం బాదాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ అజేయ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆరంభం నుంచే దాటిగా ఆడుతూ విరాట్ కేవలం 85 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. చివరి వరకూ క్రీజ్ లో నిలిచి మొత్తంమీద 110 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, పదమూడు ఫోర్లతో 166 రన్స్ చేశాడు. ఈ స్కోరులో ఎనిమిది సిక్సర్లు, పదమూడు ఫోర్లు ఉన్నాయి. కాగా వన్డే కెరీర్‌లో అతనికిది 46వ సెంచరీ కాగా ఓవరాల్‌గా 74వది. కాగా ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు కోహ్లీ. స్వదేశంలో అత్యధికంగా 21 సెంచరీలు బాదిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ 20 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ స్వదేశంలో చేసిన 20 సెంచరీలను 160 మ్యాచ్ ల్లో పూర్తిచేస్తే, విరాట్ మాత్రం 101 మ్యచ్ ల్లోనే చేరుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంకపై టీమ్ ఇండియా 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విఫలమైన శ్రీలంక 73 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయాన్ని మూట గట్టుకున్నది.ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ అద్భుత శతకాలతో రాణించారు. కోహ్లి, గిల్ మెరుపులతో భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 390 రన్స్ చేసింది. రికార్డ్ టార్గెట్‌తో బరిలో దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. వరుసగా ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 22 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. 19 రన్స్‌తో ఫెర్నాండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. షమీ, కుల్దీప్ యాదవ్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. శ్రీలంకతో మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో పరుగులు తేడా పరంగా అతి పెద్ద విజయాన్ని అందుకున్న జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. గతంలో ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరు మీద ఉంది. ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును శ్రీలంకతో మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా తిరగరాసింది.
http://www.teluguone.com/news/content/virat-kohly-scores-yet-another-century-39-150016.html





