బీజేపీ గూటికి వల్లభనేని వంశీ?
Publish Date:May 20, 2024
Advertisement
ఏపీ రాజకీయాల్లో పోలింగ్ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీ ఓటమి ఖాయమని, కూటమి 140 నుంచి 150 సీట్లతో తెలుగుదేశం అధికారంలోకి రాబోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో పోలింగ్ శాతం నమోదైంది. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికితోడు స్థానికంగా ఉన్న ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి మరీ ఓటు వేశారు. దీంతో పలు ప్రాంతాల్లో తెల్లవారు జామున 2గంటల వరకు పోలింగ్ జరిగింది. భారీ సంఖ్యలో నమోదైన పోలింగ్‌తో కూటమి విజయం ఖాయమని స్పష్టమవుతోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల్లో కంగారు మొదలైంది. ఫలితాలు రాకముందే కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో చేరేందుకు ఆ పార్టీ పెద్దల వద్దకు రాయబారాలు నడుపుతున్నారు. వీరిలో గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. ప్రస్తుతం వంశీ అమెరికా వెళ్లాడు. తన కొడుకు చదువుకోసమని ఆయన డల్లాస్ వెళ్లినట్లు అనుచరులు చెబుతున్నారు. అసలు విషయం మాత్రం టీడీపీ పెద్దలతో రాజీకోసం వంశీ ఉన్నట్లుండి డల్లాస్ లో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం నుంచి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తెలుగుదేశం ఎన్ఆర్ ఐల ద్వారా రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీలో చేరేందుకు సైతం వంశీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. వల్లభనేని వంశీ రాజకీయ ఎంట్రీ తెలుగుదేశంతోనే ఆరంభమైన సంగతి తెలిసిందే. గన్నవరం నుంచి రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధిగా విజయం సాధించిన వంశీ ఆ తరువాత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు. వైసీపీలో చేరిన కొద్దిరోజులకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వంశీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు రాజకీయ పార్టీల్లోని సీనియర్ నేతలు సైతం వంశీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఖండించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేయగా.. టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. వంశీ వైసీపీలోకి వెళ్లిన తరువాత గ్రామస్థాయిలోని టీడీపీ నేతలు పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యల తరువాత వంశీ అనుచరులు సైతం ఆయనకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో యార్లగడ్డకు మద్దతుగా నిలిచారు. దీంతో వంశీ ఓటమి ఖాయమని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది. వైసీపీ అధికారం కోల్పోతుండటం, నియోజకవర్గంలో తన ఓటమి ఖాయమవ్వడంతో వంశీ బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆయనకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీజేపీలోని తన సన్నిహితుల ద్వారా పార్టీ పెద్దలతో చర్చించి కాషాయం కండువాను కప్పుకునేందుకు వంశీ ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వంశీ, బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకోవటంతోపాటు తెలుగుదేశం పెద్దలతో రాజీకి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. డల్లాస్ లోని తెలుగుదేశం ఎన్ఆర్ ఐల ద్వారా చంద్రబాబు, లోకేశ్ లతో మాట్లాడేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే పలు దఫాలుగా క్షమాపణలు చెప్పిన వంశీ, నేరుగా లోకేశ్ తో మాట్లాడటం ద్వారా తనపై ఆగ్రహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చూస్తున్నారని అంటున్నారు. అయితే, చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ ముఖ్యనేతలంతా కొడాలి నాని, వల్లభనేని వంశీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ముందుగా వారిద్దరికి సరైన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేశ్ లు వంశీతో మాట్లాడేందుకు ఇష్టపడరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే బీజేపీలో చేరడం ద్వారా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవని వంశీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీలోని ముఖ్య నేతలతో వల్లభనేని వంశీతో పాటు మరికొందరు వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వీరంతా ఫలితాలు రాగానే వైసీపీని వీడి బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం. వంశీ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని, దేశ స్థాయిలో లోక్ సభ ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర పార్టీ పెద్దల అనుమతితో ఆయన కాషాయం కండువా కప్పుకుంటారని గన్నవరం నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది. మొత్తానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే వల్లభనేని వంశీ బీజేపీలోకి వెళ్లడం ఖాయమని, తద్వారా కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే రాజకీయ ఇబ్బందుల నుంచి బయటపడాలని చూస్తున్నారని వంశీ అనుచరులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamshi-to-join-bjp-25-176456.html