అజ్ణాతంలో వల్లభనేని వంశీ .. గాలిస్తున్న పోలీసులు?
Publish Date:Dec 29, 2025
Advertisement
చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటారు. చేసిన పాపం ఊరికే పోదని కూడా నానుడి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 204 వరకూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ఒకరు ఇద్దరే అని కాదు గత వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు అరెస్టై జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరి కొందరు అరెస్టై ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. ఇంకా కొందరు అరెస్టు అవుతామన్న భయంతో వణికి పోతున్నారు. కొందరైతే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలాంటి నేతలలో వల్లభనేని వంశీ ఒకరు. వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో నమోదైన అభియోగాలపై ఆయన ఇప్పటికే అరెస్టై.. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్ల భనేని వంశీ కొద్ది కాలం కిందట బెయిలుపై విడుదలయ్యారు. బెయిలుపై విడుదలైనా ఆయన రాజకీయాలకు దూరంగా దాదాపుగా ఏకాంత వాసం అనుభవిస్తున్నట్లుగా మెలుగుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా తనపై నమోదైన కేసులో అరెస్టు భయంతోనే ఆయన అజ్ణాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీపై తాజాగా కొత్త కేసు నమోదైంది. జూన్ 2024లో వంశీ తన అనుచరులతో సునీల్ ను హత్య చేయడానికి కుట్రపన్నారన్నది ఆ కేసు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా పోలీసులు వంశీకి నోటీసులు అందించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వల్లభనేని వంధీ కిడ్నాప్, బెదరింపులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్, తెలుగుదేశం గన్నవరం కార్యాలపంపై దాడి తదితర కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ కేసులలో అరెస్టై బెయిలపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా కేసులో అరెస్టు భయంతో వల్లభనేని వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamshi-in-underground-39-211759.html





