సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం
Publish Date:Dec 29, 2025
Advertisement
రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి. దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే సినిమాలకు గుడ్ బై చెప్పారు విజయ్. ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయల వరకూ పారితోషకం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు. ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్ టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది. టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం. ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజకీయంగా డీఎంకేతోనే తమ పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. విజయ్ ది చెన్నై. అయితే ఆయన మధురైని తన సొంత నియోజకవర్గం చేసుకోవాలని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా. ఇక పోతే విజయ్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా ఫెమిలియర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజయ్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు. ఆయన వారిని ఏమంతగా తీసుకోవడం లేదు. ఏపీ నుంచి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం తన భర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజయ్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాలని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో బీజేపీ ఉంది. దీంతో ప్రధాన పోటీ డీఎంకే- టీవీకే మధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇక విజయ్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద డీఎంకే, టీవీకే మధ్య ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.
http://www.teluguone.com/news/content/hero-vijay-goodbye-to-cinemas-39-211697.html





