క్రికెట్ దిగ్గజాలను అబ్బురపరుస్తున్న వైభవ్ దూకుడు
Publish Date:May 22, 2026
Advertisement
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాలకు హాట్ టాపిక్‌గా మారాడు. 15 ఏళ్ల వయసులోనే ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ స్టార్ బౌలర్లకు మింగుడుపడకుండా తయారయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లపై వైభవ్ విరుచుకుపడుతున్న తీరు అభిమానులతో పాటు క్రికెట్ దిగ్గజాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అద్భుతాలు చేస్తున్నాడని, తమ వాట్సాప్ గ్రూప్‌లో వైభవ్ చర్చే ప్రధాన అంశంగా మారిందన్నాడు. మైదానంలో అతడు ఆడటం మొదలుపెడితే.. తమ గ్రూప్‌లో మెసేజ్‌లు వరదలా వస్తుంటాయని... మళ్లీ చెలరేగాడు.. 17 బంతుల్లో 43 పరుగులు... అంటూ మెసేజ్‌లు చేస్తూ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారని పేర్కొన్నాడు. అతడి దూకుడుని బౌన్సర్, యార్కర్లతో చెక్ పెట్టొచ్చని భావించే లోపే.. మరో కొత్త షాట్‌తో అందరినీ షాక్‌కు గురి చేస్తాడనిఅని స్టువర్ట్ బ్రాడ్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ఇంగ్లండ్ క్రికెటర్ బట్లర్ కూడా వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్ ప్లేలో ప్రతి రెండు బంతులకు ఒక బౌండరీ బాదుతున్నాడు. ఇది అసాధారణ ప్రతిభ అంటూ కొనియాడాడు. ఇదిలా ఉంటే, వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 53 సిక్సర్లు బాది.. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇక క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే సీజన్‌లో 59 సిక్సర్ల రికార్డుకు వైభవ్ అత్యంత చేరువలో ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులోనూ వైభవ్ దూసుకెళ్తున్నాడు. 13 మ్యాచుల్లో 579 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సూర్యవంశీ సిక్స్‌ల ‘వైభోగం’ మరింత పీక్ స్టేజ్‌కి అవకాశం కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/vaibhav-suryavanshi-36-220610.html




