మిస్టరీగా మారిన తాబేళ్ల మరణాలు.. విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Publish Date:Dec 30, 2024
Advertisement
కాకినాడ జిల్లా తాళ్లరేవు తీరంలో తాబేళ్ల మరణాలు మిస్టరీగా మారాయి. ఇప్పటి వరకూ ఇంత పెద్ద సంఖ్యలో తాబేళ్లు ఇలా మరణించి తీరానికి కొట్టుకురావడం ఎన్నడూ చూడలేదని మత్స్య కారులు అంటున్నారు. తాళ్ల రేవు తీరంలో అరుదైన ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయనీ, ఈ మరణాల వెనుక ఏదో మిస్టరీ ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాబేళ్లు నోటి వెంట నురుగలు కక్కుకుని మరణించినట్లుగా ప్రాథమికంగా నిర్థారించారు. విషప్రయోగం అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. పెద్ద సంఖ్యలో తాబేళ్లు ఇలా మరణిస్తుండటం పట్ల మత్స్యకారులు, తీర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అరుదైన ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద సంఖ్యలో మరణిస్తుండటం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. మిస్టరీగా మారిన తాబేళ్ల మరణం విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. తాబేళ్ల మరణం వెనుక మిస్టరీని ఛేదించాలని కోరారు. దీంతో పవన్ కల్యాణ్ దీనిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. తాబేళ్ల మరణంపై సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు.
http://www.teluguone.com/news/content/turtles-deaths-near-tallarevu-coast-25-190577.html





