ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ముహూర్తం ఉగాది!
Publish Date:Dec 30, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాలను అందుబాటులోకి తీసుకువచ్చచేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉగాది పర్వదినం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించేందుకు నిర్ణయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలలో రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అన్నది ఒకటి. సోమవారం (డిసెంబర్ 30) అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాదరెడ్డి, అధికారులతో సంబంధిత సుదీర్ఘ భేటీ నిర్వహించిన చంద్రబాబు ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా మహిళలకు ఈ అవకాశం కల్పిస్తే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అదేసమయంలో ప్రస్తుతం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సేవలు అందుతున్న తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకల్లో ఈ పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను నెల రోజులలోగా అందజేయాలని ఆదేశించారు. ఏయే సర్వీసులను మహిళలకు కేటాయించాలి? తద్వారా జరిగే పరిణామాలు.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధిపై పడే ప్రభావం వంటి వాటిని కూలంకషంగా అధ్యయనం చేయాలనీ, అదే సమయంలో తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాలలో అవలంబిస్తున్న విధానాలను, అలాగే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు చూపిన ప్రత్యామ్నాయాలపై కూడా అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడానికి ఏ మేరకు అదనపు బస్సులు అవసరమౌతాయో తెలియజేయాలని అన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పక్షాన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం హామీ కీలకంగా మారింది. ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఉగాది నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కానుంది. దీనిపై మహాళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/free-traval-in-rtc-busses-25-190574.html





