సమయం లేదు మేడమ్..! కేసీఆర్ తీసిన గోతిలో..
Publish Date:Feb 23, 2021
Advertisement
మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నిక. సరిగ్గా మూడు వారాల ముందు అధికార పార్టీ అభ్యర్థి ప్రకటన. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం. బీజేపీకి సిట్టింగ్ సీట్. అది గెలవడం గులాబీ పార్టీకి సవాలే. మొదట టీఆర్ఎస్ కు అభ్యర్థే దొరకలేదు. ఆ తర్వాత అతికష్టం మీద పీవీ కూతురు వాణీదేవిని వెతికి తీసుకొచ్చి మరీ పోటీలో నిలిపారు. ఆమె రాజకీయాలకు కొత్త. తండ్రి పేరు చెప్పక పోతే ఆమెను ఎవరూ గుర్తు పట్టరు. రాజకీయ అనుభవం శూన్యం. ఇప్పటి వరకూ బహిరంగ వేదికలపై మాట్లాడటం, ప్రసంగించడం చేయలేదు. అయినా.. గట్టి పోటీ ఉండే నియోజకవర్గంలో వాణీదేవిని బరిలో నిలిపారు కేసీఆర్. ఆ సీటు గెలిచేందుకేనా? కనీసం పోటీ అయినా ఇవ్వగలరా? ఓడిపోయే స్థానంలో వాణీదేవీని నిలబెట్టడం ఎలా వ్యూహాత్మకం అవుతుంది? ఇలా అనేక ప్రశ్నలు. కేసీఆర్ తీరుపై అనేక అనుమానాలు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ నుంచి సిట్టింగ్ అభ్యర్థి, బలమైన నేత రామచంద్రరావు పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గతంలో గెలిచిన వ్యక్తి. ఆయనకి వామపక్ష పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి చిన్నారెడ్డి సవాల్ విసురుతున్నారు. ఇంతటి గట్టి పోటీ ఉన్న స్థానంలో ఎలాంటి రాజకీయ పరపతి లేని వాణీదేవిని బరిలో నిలిపితే.. ఆమె ఏ మాత్రం పోటీ ఇస్తారనేది సందేహమే. మరోవైపు సమయమూ మించిపోతోంది. నామినేషన్ల ఆఖరి తేదీకి మూడు రోజుల ముందు మాత్రమే వాణీదేవి పేరును ప్రకటించారు కేసీఆర్. ఎన్నికల ప్రచారానికి గట్టిగా రెండు వారాల టైమ్ కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడమంటే మాటలు కాదు. అందులోనూ రాజకీయాలకు కొత్త అయిన వాణీదేవికి ఇది మరింత కష్టం. గతంలో మాదిరి కేవలం కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు చూసి ఓటు వేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రభుత్వ వ్యతిరేఖత స్పష్టంగా కనిపిస్తోంది. జనాలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్ కు బుద్ది చెబుతామా అన్నట్టు కసిగా ఉన్నారు. దుబ్బాక ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు. ఇంతటి వ్యతిరేక పరిస్థితుల్లో వాణీదేవిని పోటీలో దించి ఆమెకు అన్యాయం చేస్తున్నారనే ప్రతిపక్షాల మాట సమంజసంగానే ఉందని అంటున్నారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం భౌగోళికంగా అతి పెద్దది. 3 జిల్లాలు.. 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉంది. సుమారు 5 లక్షలకు పైగా ఓటర్లు. పట్టభద్రుల నియోజక వర్గం కావడంతో ఉద్యోగులు, నిరుద్యోగులే అదికం. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, నియామకాల అంశంలో నిరుద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. వీళ్లు అధికార పార్టీకి ఓటేసే అవకాశం అతి తక్కువేనని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి పథకాల గురించి వారికి వివరించాలన్నా ఎంతో సమయం, పకడ్బందీ ప్రచారం అవసరం. బీజేపీ అభ్యర్థి రామచంద్రారావు తన పదవీ కాలం ముగియక ముందునుంచే ముందస్తు ప్రచారం ప్రారంభించేశారు. పోటీలో నిలిచిన నాగేశ్వరరావు పరిచయం, ప్రచారం అవసరం లేని అభ్యర్థి. ఇక కాంగ్రెస్ కేండిడేట్ చిన్నారెడ్డి జగమెరిగిన నేత. ఇంతటి హేమాహేమీల మధ్య కొత్తగా వచ్చిన వాణీదేవి ప్రచారం ఎలా చేస్తారనేది ఆసక్తికరం. నియోజకవర్గమంతా తిరిగేందుకు ఆమెకు సమయమే లేదు. రెండు వారాల్లో మూడు జిల్లాలను చుట్టేయడం మాటలు కాదు. మరోవైపు.. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్న సిట్టింగ్ కేండిడేట్ పల్లా రాజేశ్వరరావు పేరును ఎంతో ముందుగానే ప్రకటించారు గులాబీ బాస్. నెలల ముందు నుంచే పల్లా రాజేశ్వర రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సభలు, సమావేశాలతో విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన పల్లా ఇలా జోరు మీదుంటే.. అదే అధికార పార్టీకి చెందిన మరో అభ్యర్థి వాణీదేవీకి మాత్రం ఏం చేయాలో, ప్రచారం ఎలా నిర్వహించాలో అర్థం కాని పరిస్థితి. అందుకే నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆమె ప్రచారానికి వెళ్లలేదు. ఒకవేళ ఎలాగోలా ప్రిపేర్ అయి ప్రచారం చేద్దామన్నా.. సమయం లేదు మిత్రమా అంటున్నారు పార్టీ వర్గాలు. పీవీ కూతురుగా అభ్యర్థి పేరైతే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది కానీ.. ఆమెకు ఎందుకు ఓటు వేయాలో.. ఓటు వేస్తే ఎలాంటి పాలన అందిస్తారో.. ఓటర్లకు వివరించేందుకు టైమ్ సరిపోయేలా లేదు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లకు వాణీదేవి గెలుపు బాధ్యతలు అప్పగించినా.. అభ్యర్థి ఓటు అడిగితేనే ఓటర్లు స్పందిస్తారు. కనీసం అందుకు కూడా సమయం సరిపోయేలా లేదు. ఇదంతా కేసీఆర్ చేజేతులారా చేసిందో..? లేక విపక్షాలు ఆరోపిస్తున్నట్టు వాణీదేవిని బలిపశువు చేస్తున్నారో..?..
http://www.teluguone.com/news/content/trs-mlc-candidate-vanidevi-no-tome-to-campaign-25-110564.html





