కేటీఆర్ ప్రధాని అయితే సీఎం ఎవరో?
Publish Date:Sep 29, 2021
Advertisement
తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కేసీఆర్ సీఎం పదవి తీసుకోరని ప్రచారం జరిగింది. తర్వాత కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారనే చర్చ బయటికి వచ్చింది. మూడేండ్లుగా ఇది సాగుతూనే ఉంది. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగినా... ఎన్నికలు జరిగినా ఈ అంశం తెరపైకి వస్తుంది. కాని ఇది ప్రచారంగానే మిగిలిపోతోంది. కొన్ని సార్లు సీఎం కేసీఆరే స్వయంగా ముఖ్యమంత్రి మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అయినా కేటీఆర్ పట్టాభిషేకంపై ప్రచారం మాత్రం ఆగలేదు. సీఎం కేసీఆర్ వరుస ఢిల్లీ పర్యటనలతో మరోసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అంశం ప్రచారంలోకి వచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇస్తారనే చర్చ సాగుతోంది. అయితే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం సాగుతుండగా.. జీవన్ రెడ్డి మాత్రం ప్రధానమంత్రి పదవికే గురి పెట్టారు. దేశ భవిష్యత్ ప్రధాని కేటీఆరేనని జోస్యం చెప్పారు. మరో 20, 30 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావడం పక్కా అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. ఈ దెబ్బతో తమకు భవిష్యత్ లేదని కాంగ్రెస్, బీజేపీలు కలత చెందుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలో ఇలాంటి లీడర్ ఉండటం గ్రేట్ అని జాతీయ స్థాయిలో కేటీఆర్ పై చర్చ నడుస్తుందని కూడా చెప్పారు జీవన్ రెడ్డి. కేటీఆర్ కాబోయే ప్రధాని అంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం ఉన్న సమయంలో ప్రధానమంత్రి అవుతారని ఎందుకు చెప్పారన్న దానిపై రకరకాల వాదనలు వస్తున్నాయి. కేటీఆర్ ఇప్పట్లో సీఎం అయ్యే అవకాశాలు లేకపోవడం వల్లే పీఎం అంటూ జీవన్ రెడ్డి కామెంట్ చేశారని అంటున్నారు. కేటీఆర్ కాకుండా మరొకరిని సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఎమ్మెల్సీ కవిత కూడా సీఎం కేసులో ఉన్నారని, కుటుంబంలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ముఖ్యమంత్రి మార్పు జరగడం లేదని గతంలో ప్రచారం కూడా జరిగింది. ఇక కేటీఆర్ ను ప్రధానిగా చెప్పడం ఏంటనే ప్రశ్న కూడా వస్తోంది. కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు జీవన్ రెడ్డి అతిగా మాట్లాడారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లోనే సాగుతోంది. విపక్షాలు మాత్రం జీవన్ రెడ్డి ప్రకటనపై సెటైర్లు వేస్తున్నాయి. సీఎం సీటుకు దిక్కు లేదు ప్రధానమంత్రి అవుతారా అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో విపక్షాలు దూకుడు పెంచాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజవ దండోరా యాత్రలతో దూసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమనే ధీమా కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీంతో తమకు మరోసారి అధికారం రావడం కష్టమని గులాబీ నేతలు గ్రహించడం వల్లే... ఇప్పుడు కొత్తగా పీఎం అంటూ ప్రకటనలు చేస్తున్నారనే చర్చ కొన్ని వర్గాల నుంచి వస్తోంది. కేటీఆర్ పీఎం అవుతారని చెప్పడం ద్వారా.. పరోక్షంగా సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పకనే చెప్పారనే చర్చ కూడా సాగుతోంది.
http://www.teluguone.com/news/content/trs-mla-jeevan-reddy-says-ktr-will-be-pm-next-20-years-25-123771.html





