వైసీపీ ఎమ్మెల్యేపై రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు..
Publish Date:Sep 29, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు ఉచ్చు బిగిసుకుంటోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారంపై టీడీపీ శ్రేణులు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాయి. మాజీ ముఖ్యమంత్రిపై దౌర్జన్యానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటవిక పాలన సాగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. అయినా పోలీసులు అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగానే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం కోసం జోగి రమేశ్ దండయాత్రగా రావడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై టీడీపీ వర్గాలు సీరియస్ గా స్పందించాయి.జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. తాజాగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు లేఖల రూపంలో ఫిర్యాదులు చేసింది. టీడీపీ గ్రామ కమిటీల్లోని నేతలు తీర్మానాలు చేసి సంతకాలు చేసిన లేఖలను పోస్టు ద్వారా పంపినట్లు టీడీపీ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. సెప్టెంబరు 17న చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం కోసం జోగి రమేశ్, అతని అనుచరులు దండయాత్రగా రావడం రాష్ట్రంలోని రాక్షస పాలనకు పరాకాష్ఠ అని పేర్కొంది. ఈ దాడికి డీజీపీ, సీఎంల మద్దతు ఉందని జోగి రమేశ్ బహిరంగంగా ఒప్పుకున్న విషయాన్ని ప్రస్తావించిన టీడీపీ.. డీజీపీని రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. సీఎం నేతృత్వంలో ఇలాంటి దాడి జరగడం ప్రజాస్వామ్యానికే చీకటి రోజని టీడీపీ అభిప్రాయపడింది. ప్రతిపక్ష నేతలను బెదిరించడం, ఇళ్లపై దాడులు చేయడం వంటి హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదని టీడీపీ నాయకులు అన్నారు. దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. టీడీపీ నేతల ఫిర్యాదు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ నేతలు మాత్రం జోగి రమేష్ పై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/tdp-complaint-to-presdient-25-123769.html





