జూబ్లీ బరిలో టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కు షాక్!
Publish Date:Oct 13, 2025
Advertisement
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి, సిట్టింగ్ సీటును నిలుపుకుని రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటడానికి సర్వశక్తులూ ఒడ్డి సమాయత్తమవ్వడానికి సిద్ధమౌతున్న బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వడానికి టీఆర్ఎస్ రంగంలోకి దిగింది. అదేంటి టీఆర్ఎస్ పేరు మార్చుకుని బీఆర్ఎస్ అయ్యింది కదా? మళ్లీ టీఆర్ఎస్ బరిలోకి దిగడమేంటని అనుకుంటున్నారా? ఔను తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రక్షణ సమితి-డెమొక్రట్ (టీఆర్ఎస్-డి)అనే పార్టీ జూబ్లీ బరిలో అభ్యర్థిని నిలబెట్టబోతున్నది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. అయతే పార్టీలోంచి తెలంగాణ పేరును అయితే తీసేశారు కానీ, ఆయన రాజకీయాలు మాత్రం తెలంగాణను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ తెలంగాణ పేరును పార్టీ పేరు లోంచి తీసేసిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకూ దూరమయ్యారు. 2023 ఎన్నికలలో ఓటమి తరువాత ఆయన జనం ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. సరే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరో మాజీ మంత్రి హరీష్ రావులు.. బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ముందుకు తీసుకుపోవడానికి, ప్రజలలో పార్టీ పట్టును పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. జూబ్లీ ఉప ఎన్నికలో విజయం లక్ష్యంగా పార్టీని సమాయత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీ ఎన్నికలో అభ్యర్దిని నిలబెట్టడానికి టీఆర్ఎస్ -డి రెడీ అవ్వడం బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. అవును జూబ్లీ బైపోల్ లో టీఆర్ఎస్-డి రంగంలోకి దిగుతోంది. పార్టీ అభ్యర్థిగా కంచర్ల మంజూష అనే మహిళను రంగంలోకి దింపబోతున్నది. ఈ విషయాన్ని టీఆర్ఎస్-డి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ సోమవారం (అక్టోబర్ 13) ప్రెస్ క్లబ్ లో పార్టీ జెండాను, వెబ్ సైట్ ను ఆవిష్కరించి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎ్ -డి లోగో రూపకల్పన చేశామన్న సత్యనారాయణ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీఆర్ఎస్-డి అభ్యర్థిగా తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు కంచర్ల మంజూషను ప్రకటించారు. ఇక టీఆర్ఎస్-డి పార్టీ లోగో, జెండా అన్నీ బీఆర్ఎస్ ను పోలి ఉన్నాయి. గులాబి రంగు, జెండా, గుర్తు అన్నీ బీఆర్ఎస్ ను పోలి ఉండటంతో బీఆర్ఎస్ క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ -డి అభ్యర్థి జూబ్లీ బైపోల్ లో రంగంలోకి దిగితే తమ విజయావకాశాలకు గండి పడటం ఖాయమన్న ఆందోళన బీఆర్ఎస్ వర్గాలలో వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/trs-in-jublee-fray-39-207875.html





