ప్రాథమిక విచారణలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నేరం నిర్ధారణ అయ్యింది.!
Publish Date:Jul 30, 2026
Advertisement
మహిళా ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను హైదరాబాద్ సీపీ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్షుణ్ణంగా విచారించిన తరువాతనే పోలీసులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సజ్జనార్ కథనం ప్రకారం కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత పట్టుదలతో యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించి, 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అదే ఏడాది డిసెంబర్ నెల నుంచి హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. నిందితుడికి బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. సివిల్స్ సాధించిన తన ప్రయాణంపై ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఒక పోస్ట్‌ను చూసి ఆమె స్పందించడంతో వారి సంభాషణలు మొదలయ్యాయి. సదరు మహిళ కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, ప్రత్యేక సెలవులో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసే శిక్షణలో చేరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. పోలీస్ అకాడమీలో శిక్షణ సమయానికి వీరిరువురి మధ్యా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఒకానొక సందర్భంలో ఆగ్రహంతో బాధితురాలికి చెందిన ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేశాడు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో అతడిని బ్లాక్ చేసింది. దాంతో నిందితుడు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, వారిద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను బయటపెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి అనుమతి లేకుండానే ఆమె కుటుంబ సభ్యులకు, సహచర అధికారులకు ఫోన్లు చేస్తూ వేధించాడు. వేధింపులు భరించలేక బాధితురాలు అతడికి పూర్తిగా దూరంగా ఉంటూ, తదనంతరం మరొకరిని వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి ధోరణిలో ఎ మార్పు రాకపోగా, పెళ్లి తర్వాత కూడా వేధింపులను కొనసాగించాడు. దీనితో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో చట్ట నిబంధనల ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉప్పరపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు రిమాండ్ చేశారు. Trainee IPS Uday Krishna Reddy, CP Sajjanar Statement, Sexual Harassment Case, Hyderabad Police, NPA Hyderabad IPS Case
http://www.teluguone.com/news/content/trainee-ips-uday-krishna-reddy-36-227529.html





