తెలుగు చిత్ర పరిశ్రమ కూడా బయటకి పోక తప్పదా
Publish Date:Aug 5, 2013
Advertisement
మొన్న కేసీఆర్ “విభజన ప్రక్రియ పూర్తికాగానే ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోక తప్పదు, వారికి వేరే ఆప్షన్స్ ఉండవని” చెప్పిన మాట కేవలం వారికే కాక ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన పారిశ్రామిక వేత్తలకు, విద్యా సంస్థల అధిపతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సినీ రంగానికి చెందిన వారికి కూడా చాలా ఆందోళన కలిగించింది. దానికి తోడూ కేసీఆర్ తాము బడా వ్యాపారవేత్తలకే వ్యతిరేఖం తప్ప పొట్టచేత్తో పట్టుకొచ్చిన వారికి కాదని పదేపదే చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మొట్ట మొదటగా అందరి దృష్టి తెలుగు సినీ పరిశ్రమపైనే పడుతుంది. స్వర్గీయ యన్టీఆర్ ప్రోత్సాహంతో మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలి వచ్చిన తెలుగు సినీ పరిశ్రమ, ఈ రెండు మూడు దశాబ్దాలలో బాగానే స్థిరపడింది. తెలుగు సినిమా నిర్మాణానికి అవసరమయిన స్టూడియోలు, రికార్డింగ్ దియేటర్లు, సాంకేతిక నిపుణులు, వివిధ రకాలయిన సేవలు అన్నీ కూడా అక్కడే లభ్యమవడంతో తెలుగు సినీ పరిశ్రమ త్వరగానే నిలద్రోక్కుకొంది. అయితే తెలంగాణా ఉద్యమాల వల్ల గత మూడు నాలుగేళ్ళుగా సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకానొక సమయంలో ఇక హైదరాబాద్ వీడకపోతే మనుగడ కష్టమని కూడా భావించింది. ఆ సమయంలోనే ప్రముఖ నిర్మాత డా.రామానాయుడు వైజాగ్ లో రామానాయుడు సినిమా స్టూడియోని నిర్మించడంతో ఇక సినీ పరిశ్రమకి తరువాత గమ్యం వైజాగేనని అందరూ భావించారు. కానీ ఎలాగో అన్ని అవరోధాలను అధిగమించి మళ్ళీ వేగం పుంజుకొంటున్న సమయంలో ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. దీనితో ఇప్పుడు సినీ పరిశ్రమ హైదరాబాదులోనే ఉండాలా లేక ఆంధ్రాకి తరలిపోవాలా? అనే ప్రశ్న మరో మారు తలెత్తింది. హైదరాబాదులో భారీ పెట్టుబడులు పెట్టి అన్ని హంగులు ఏర్పరుచుకొన్న తరువాత ఇప్పుడు చిత్ర పరిశ్రమను మరో ప్రాంతానికి తరలించడం అంటే చాల కష్టమే, గాక భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. అందువల్ల చిత్ర పరిశ్రమకు చెందిన వారు కొంచెం కష్టమయినా, కొన్ని కొత్త ఇబ్బందులు ఎదురయినా హైదరాబాదులోనే కొనసాగడం మేలనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే, రాష్ట్రం రెండుగా విడిపోవడంతో, సినిమా షూటింగ్, ఆడియో విడుదల, సెన్సార్, పంపిణీ, రిలీజ్ వంటి సాధారణ వ్యవహారాలు కూడా మరింత క్లిష్టంగా మారడమే కాకుండా, ఖర్చులు కూడా భారీగా పెరగక తప్పదు. తెలుగు సినిమాను ఇదివరకులా రెండు ప్రాంతాలలో నిర్మించుకోవడం, విడుదల చేసుకోవడం వంటి కార్యక్రమాలకి రెండు చోట్లా విడివిడిగా అనుమతులు, సెన్సారింగ్, పన్నులు, లెక్కలు అన్నీపాటించక తప్పదు. అంతిమంగా ఈ భారమంతా ప్రేక్షకుడే మోయవలసి ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమత మవుతున్న సినీ పరిశ్రమకు ఈ సవాళ్ళను స్వీకరించి ముందుకు సాగడం నిజంగా చాలా కష్టమే. అయితే మనుగడ కోసం పోరాటం తప్పదు. గతంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలద్రొక్కుకొన్న మన తెలుగు సినీ పరిశ్రమ దీనిని కూడా తప్పకుండా ఎదురొడ్డి విజయం సాధిస్తుందని ఆశిద్దాము. అయితే, అందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కూడా తమ వంతుగా పూర్తి సహకారం అందించవలసి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/tollywood-37-24953.html





