రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ ఎందుకు తొందర పడుతోంది
Publish Date:Aug 6, 2013
Advertisement
తెలంగాణా ఉద్యమాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని తెలిసినప్పటికీ, యుపీయే ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా కమిటీలతో, చర్చలతో తాపీగా కాలక్షేపం చేసింది. సాధారణ ఎన్నికలకి కేవలం 8 నెలలు ముందుగా తెలంగాణా ప్రకటన చేసి, నాటినుండి కాంగ్రెస్ సంస్కృతికి విరుద్దమయిన పద్దతిలో అనూహ్య వేగంగా దానిని అమలు చేసేందుకు చాలా చురుకుగా పని చేస్తోంది. సాదారణంగా కాంగ్రెస్ పార్టీ ఇంత వేగంగా పనిచేయడం ఎన్నడూ చూడలేము. అయితే ఆ పార్టీ ఎందుకు ఎందుకు ఓవర్ టైం చేస్తూ రాష్ట్ర విభజనకి కష్టపడుతోంది? అని ప్రశ్నించుకొంటే ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమేనని అర్ధం అవుతుంది. వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఏర్పడబోతున్నమన రెండు రాష్ట్రాలలో స్థిరపడటం పెద్ద పనేమీ కాదు. కానీ ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, వైకాపా, తెరాసాలు మాత్రం ఈ సరికొత్త వాతావరణంలో, రాజకీయ పరిస్థితుల్లో ఇమడటానికి కొంచెం సమయం పడుతుంది. అవి ఈ సందిగ్ధ పరిస్థితిలో ఉండగానే ఎన్నికలు నిర్వహించినట్లయితే వాటిని తేలికగా ఓడించవచ్చునని కాంగ్రెస్ ఆలోచన. అందుకే వీలయినంత వేగంగా రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేస్తానని పదేపదే చెపుతోంది. తద్వారా తెలంగాణా తానే ఇస్తున్నాని బలమయిన సంకేతాలు పంపుతూ అక్కడి ప్రజల మనసులు గెలుచుకోవడమే కాకుండా, కేసీఆర్ ప్రాభల్యం కూడా గండి కొట్టగలదు. ఇక, ఇటువంటి నిర్ణయం తీసుకొన్నపుడు ఇతర ప్రాంతాలలో (సీమంధ్రలో) వ్యతిరేఖత ఏర్పడటం సహజమేనని దిగ్విజయ్ సింగ్ చెప్పడం గమనిస్తే, సమైక్య ఉద్యమాలు చెలరేగుతాయని, వాటిని ఏవిధంగా సమర్ధంగా ఎదుర్కోనేందుకు కాంగ్రెస్ వద్ద తగిన వ్యూహం కూడా సిద్దంగా ఉందని అర్ధం అవుతోంది. బహుశః అంతా సర్దుమణిగేవరకు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగానో లేక డిల్లీ పద్దతిలోనో ప్రత్యేక హోదా ప్రకటించి సీమంధ్ర నేతలతో ఈ నాలుగు నెలలో చర్చలు జరిపి, వారికి ఒక్కో సమావేశం తరువాత ఒకటొకటిగా భారీ వరాలు ప్రకటిస్తూ వారు కూడా ఈ ఆటలో తమదే పైచేయి సాధించామనే భావన వారిలో కూడా కల్పించి సమైక్య ఉద్యమాలను కూడా చల్లార్చవచ్చునని కాంగ్రెస్ వ్యూహం అయి ఉండవచ్చును. తద్వారా అటు తెలంగాణా ప్రజలను, ఇటు సీమంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొని ఆయా ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపించావచ్చునని కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది. బహుశః ఈ రాజకీయ చదరంగంలో అంతా అనుకొన్నట్లు సాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాదించే అవకాశాలున్నాయి. అయితే, ప్రాంతీయ పార్టీలు ఈ వ్యూహాన్ని ఏవిధంగా ఎదుర్కొంటాయో, ఎదుర్కొని నిలబడగలవో లేదో రానున్న కాలమే చెపుతుంది.
http://www.teluguone.com/news/content/congress-37-24987.html





