డిక్లరేషనే దిక్కా.. లడ్డూ వివాదంలో జగన్ ను వదిలేసిన వైసీపీ సీనియర్లు?
Publish Date:Sep 27, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం తార స్థాయికి చేరుకున్న వేళ.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. శుక్రవారం తిరుపతికి చేరుకోనున్న వైఎస్ జగన్.. శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తమపై ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమలలో పర్యటించి.. శ్రీవారి దర్శనం తీసుకోనున్నారు. అయితే వైఎస్ జగన్.. తిరుమల శ్రీవారి దర్శనం వేళ.. డిక్లరేషన్ అంశం కీలకంగా మారింది. కొందరు హిందూ సంఘాల నేతలు.. జగన్ తిరుమలకు రావద్దని పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంతటి ఉద్రిక్తతల నేపధ్యంలో జగన్ శనివారం (అక్టోబర్ 28) తిరమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే జగన్ ను అడ్డుకుని తీరుతామంటూ.. బీజేపీ, హిందూ సంస్థలు ఇప్పటికే హెచ్చరించారు. ఇదంతా పక్కన పెడితే జగన్ డిక్లరేషన్ ఇస్తారా? అన్న విషయమే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. జ .జగన్ 27 వతేదీనే తిరుమల చేరుకుంటారు. అదే సమయంలో హిందూ సంస్థలు,బీజేపీ జగన్ తిరుమల వెళ్లాలంటే అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తిరుమల పవిత్రత కాపాడాలని హిందూ సంఘాలు మూడు రోజుల పాదయాత్ర చేట్టాయి.ముఖ్యంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పురంధరేశ్వరి అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ మాత్రం తాను 2009లో డిక్లరేషన్ ఇచ్చానని ప్రకటించారని,ఒ కసారి డిక్లరేషన్ ఇస్తే చాలని ఇప్పుడు ఇవ్వనవసరం లేదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిట్ వేసి చేతులు ఊరుకోవడమే వైసీపీకి అవకాశం ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ జ్యుడిషియల్ విచారణ కాని, సీబీఐ విచారణ గాని చేయాలని డిమాండ్ చేస్తున్నది. అయితే తెలుగుదేశం వైసీపీ డిమాండ్ పై స్పందించడం లేదు. ఎందుకంటే.. సందేహాలకు అతీతంగా వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అవకతవకలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. వాణీ ట్రస్ట్, విఐపీ టిక్కెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, కొనుగొళ్లలో కమీషన్లు వైసీపీ పరువును ఇప్పటికే పాతాళానికి దిగజార్చాయి. ఈ వివాదాల్లో పలువురు వైసీపీ నాయకుల హస్తం ఉందనే జనం నమ్ముతున్నారు.లడ్డూ తయారీకి వాడే ఆవునెయ్యి లో రివర్స్ టెండరింగ్ ద్వారా ధరలను తగ్గించడం కూడా ఉత్పత్తి దారుడికి కల్తీ చేసే అవకాశం అప్పటి టిటీడీ పాలకమండలి ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం బాగానే వస్తున్నా కూడా రివర్స్ టెండరింగ్ లు, నాణ్యతా ప్రమాణాలను తగ్గినా పట్టించుకోకవడం ఎందుకు అంటే కమీషన్ల కోసమేనని పలువురు భావిస్తున్నారు. జనబాహుల్యంలో కూడా అదే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతున్నాది. గతంలో జగన్ సీఎం కుమారుడిగా, సీఎంగా తిరుమల అనేక సార్లు వెళ్లారు. కాని డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారం అడ్డంపెట్టుకుని వెళ్ళారు.ఇప్పుడు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అందులో లడ్డూ తయారీలో కల్తీ జరిగిన విషయంలో ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు డిక్లరేషన్ లేకుండా ఆయన శ్రీవారిని దర్శించుకోవడం అనుమానమే. డిక్లరేషన్ ఇవ్వడం అంటే వెంకటేశ్వర స్వామి పై విశ్వాసం ఉందని చెప్పడమే. మరి జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక ధర్మ పరిరక్షణ జేఏసీ అయితే ఒక అడుగు ముందుకు వేసి జగన్ కు నిజంగా వెంకన్న దేవుడిపై విశ్వాసం ఉంటే భార్య భారతి తో తిరుమల కాలినడకన వచ్చి గుండు కొట్టించుకోవాలని మరీ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. పుట్టుకతో క్రైస్తవుడయిన జగన్ అంత తొందరగా డిక్లరేషన్ ఇస్తారని ఆశించలేం.గతంలో వైఎస్ విజయమ్మ మేము హిందూ దేవాలయాలకు వెళ్లడం కేవలం హిందూ ఓటు బ్యాంక్ కోసమేనని చెప్పిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. లడ్డూ వివాదంతో హిందూ ఓటర్లను దూరం చేసుకున్నామన్న ఆందోళనే జగన్ ను తిరుమల పర్యటనకు పురిగొల్పిందనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు అదే తిరుమల దేవుడి దర్శనం కోసం జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించే ధైర్యం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా అనుమానాలు వ్యక్తం కావడానికి కారణం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా మంత్రులుగా పని చేసిన వారు, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పిన వారు, ఇతర సీనియర్ నాయకులు లడ్డూ వివాదం విషయంలో జగన్ కు మద్దతుగా మాట్లాడేందుకు సాహసించడం లేదు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మాజీ టీటీడీ చైర్మన్లు గా వివరణ ఇచ్చారు గాని పార్టీ నాయకులుగా జగన్ కు మద్దతుగా మాట్లాడడానికి సాహసించడం లేదు. తగుదునమ్మా అంటూ పొన్నవోలు మీడియా ముందుకు వచ్చి.. జగన్ ను, వైసీపీని ఇంకా డిఫెన్స్ లో పడేశారు. ఈ పరిస్థితిలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దేవుడిని దర్శించుకోవడమంటే.. ప్రజలలో తన పరపతిని మరింత దిగజార్చుకోవడమే అవుతుంది. మొత్తం మీద జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో రచ్చ జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తిరుమలలో రాజకీయ ప్రకటనలు చేయడం కూడా నిషేధం. మరి ఈ పరిస్థితుల్లో ఏమి జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
http://www.teluguone.com/news/content/tirumala-laddu-dispute-25-185696.html





