సేఫ్ జోన్ మిడిల్ ఈస్ట్‌లో భయనక వాతావరణం
Publish Date:Mar 3, 2026
Advertisement
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు తయారైంది ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల పరిస్థితి. ఇప్పటి వరకు చాలా సేఫ్ అనుకున్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇప్పుడు పరిస్థితి భయానకంగా మారింది. సంపన్న దేశాల్లో ఇప్పుడు బాంబుల మోతలు కామన్‌గా మారాయి. దీంతో ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలన్ని మూతపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడుల్లో ఆ దేశ సుప్రీంలీడర్ అయెతుల్లా ఖమేనీ హతం కావడంతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌తో పాటు.. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, కార్యాలయాలను టార్గెట్ గా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ దేశాల్లోని ప్రజలు, ఆయా దేశాలకు వచ్చిన అతిథులు వణికిపోతున్నారు. దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో పరిస్థితి భీతావహంగా మారింది. ముఖ్యంగా దుబాయ్‌ను టార్గెట్ చేసింది ఇరాన్. ఈ దాడుల్లో ఎవరూ మరణించకపోయినా.. ఆస్తి నష్టం భారీగా జరిగింది. నిజానికి ఆస్తి నష్టం కంటే.. మిడిల్ ఈస్ట్ దేశాలు ఎంత మాత్రం సేఫ్ కాదనే భావన ఏర్పడింది. నిజానికి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ మధ్య కాలంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నులంతా ఇప్పుడు ఈ దేశాలకు క్యూ కడుతున్నారు. అక్కడే తమ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. బిలియన్ డాలర్ల కొద్ది సొమ్మును కుమ్మరిస్తున్నారు. కానీ వీటన్నింటిపై పునరాలోచించేలా చేసింది ఇరాన్. దుబాయి ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నిరవధికంగా మూతపడింది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో ఒకటి దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అలాంటి ఎయిర్‌పోర్ట్‌పై కూడా ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రయాణీకులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగైన బుర్జ్ ఖలీఫాను దుబాయ్ పోలీసులు ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. బుర్జ్ ఖలీఫా టార్గెట్ గా ఇరాన్ దాడులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బుర్జ్ ఖలీఫా వద్ద దట్టమైన పొగ కమ్ముకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్‌పై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. దీంతో హోటల్ బయటి భాగంలో మంటలు చెలరేగాయి. గాలిలోనే డ్రోన్‌ను అడ్డుకున్న సమయంలో దాని అవశేషాలు హోటల్ పై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఇక్కడ ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఖతార్, బహ్రెయిన్‌లో కూడా ఈ దాడులు కొనసాగాయి. ఈ రెండు దేశాల్లోనూ అమెరికాకు కీలక స్థావరాలు ఉన్నాయి. ఖతార్‌లో అయితే యూఎస్ సెంటర్‌కామ్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. దీనిని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది ఇరాన్. బహ్రెయిన్‌లోని అమెరికన్ నేవీ బేస్‌పై ఇప్పటికే దాడి చేసింది ఇరాన్. కువైట్‌లో కూడా ఇదే సిట్యూవేషన్ నెలకొంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లోని ఎయిర్‌స్పేస్ మూతపడింది. ఎక్కడి నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
http://www.teluguone.com/news/content/terrible-situation-middle-east-36-214928.html





