వరుస అరెస్టులతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్
Publish Date:May 27, 2025
Advertisement
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదవుతాయో.. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో.. ఊహకు కూడా అందని పరిస్థితి నెలకొంది. దానికి తాజా పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహారణ. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ లీడర్లను కేసులు వెంటాడుతున్నాయి. వెంటాడుతున్నాయి అనేకంటే.. వేటాడుతున్నాయనే చెప్పాలి. తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్‌తో మరోసారి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో పిన్నెళ్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ గతంలో చేసిన అనేక అక్రమాల కారణంగా జైళ్లో ఊచలు లెక్కిస్తూ బెయిలు కోసం కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. బెయిల్ దొరకని వారు పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం.. అడ్డుకున్న వారిని బెదిరించడం.. ఇలా అనేక ఆరోపణలపై కాకాణిపై కేసు నమోదైంది. అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ప్రాంతానికి వెళ్లిపోయారు. కానీ పోలీసులు ఆయన లోకేషన్‌ను గుర్తించి.. ఏపీకి పట్టుకొచ్చారు. కోర్టు ముందు హాజరుపరిచారు. కాకాణిపై ఇవి మాత్రమే కాదు.. పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎ స్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారని ఓ కేసు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మరో కేసు ఉంది. ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు, కావలిలో పోలీసులపై అసభ్యపదజాలంతో అవమానకరంగా మాట్లాడంతో మరో కేసు, సోమిరెడ్డికి విదేశాల్లో 1000 కోట్లు ఉన్నట్లు నకిలి పత్రాలు సృష్టించిన విషయంలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు. ఇలా అనేక కేసులు కాకాణిపై నమోదయ్యాయి. వీరు మాత్రమే కాదు.. ఇప్పటికే వల్లభనేని వంశీ, పేర్ని నాని, సజ్జల భార్గవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా ఎంతో మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు, అరాచకాలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేతలంతా లీగల్ టీమ్‌ను రెడీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. రాత్రికి రాత్రి అరెస్టులు చేయడం లేదు.. న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇస్తున్నారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఇస్తున్నారు. అంతే కాదు గతంలో వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు ముందే బయటికి వస్తున్నాయి. ఇలా పక్కగా నేతలను లాక్ చేస్తున్నారు. ఇప్పటికే కాకాణి, పిన్నెళ్లి సోదరులకు ఉచ్చు బిగిసింది. ఇకపై కేసుల ఉచ్చులో చిక్కుకోబోయేది ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇక పిన్నెళ్లి సోదరులది మరో కథ. ఓ డబుల్ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి. పల్నాడు జిల్లా బొదిలవీడులలో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే ఇద్దరిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో ఇద్దరు సోదురులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారు. ఇవి మాత్రమేనా ఈ వివాదస్పద సోదరులపై మాచర్ల నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఆరోపణలతో పాటు.. అనేక కేసులున్నాయి.
http://www.teluguone.com/news/content/tenssion-in-ycp-leaders-25-198771.html





