పూర్వ వైభవం దిశగా తెలంగాణ తెలుగుదేశం!
Publish Date:Jun 14, 2025

Advertisement
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు. తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న పార్టీ. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొంత వెనుకబడింది. ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో మాత్రం ఉనికి మాత్రంగానే మిగిలిన పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తున్నది. తెలంగాణలో కూడా పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉందేమో కానీ కార్యకర్తల బలం మాత్రం దండిగా ఉంది. ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా రుజువైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అండ కోసం అన్ని రాజకీయపార్టీలూ వెంపర్లాడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రస్తావనం, ఆ పార్టీపై ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. అంతేందుకు అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేసి ఆ పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలన్న ప్రయత్నిం చేసింది.
ఇందుకు కారణం ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండటమే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో ఉన్నారు. ఈ సంగతి పలు సందర్భాలలో సందేహాతీతంగా రుజువైంది. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం ఒకింత ఇన్ యాక్టివ్ అయిన మాట వాస్తవమే.. కానీ ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ తెలంగాణ జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టడమే ఇందుకు నిదర్శనం.
2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అత్యద్భుత విజయం తరువాత.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు. పార్టీ క్యాడర్ ఎంత బలంగా ఉన్నా.. వారిని ముందుండి నడిపించే లీడర్ కూడా అవసరమే. తెలంగాణలో ఆ నాయకత్వ కొరతే తెలుగుదేశం పార్టీకి ప్రధాన సమస్యగా ఇంత వరకూ ఉంది. ఇప్పుడు ఆ సమస్యను తీర్చడంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది.అందుకే గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారిని పార్టీలోకి ఆకర్షించే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పరాజయం, తదననంతర పరిణామాలతో ఆ పార్టీ బలహీనం కావడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశంగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ బలపడటానికి తెలంగాణ తెలుగుదేశం నేతలు అప్పట్లో ఆ పార్టీ గూటికి చేరడం కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి, 2024 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం ఘనవిజయంతో తెలంగాణలో తెలుగుదేశంను వీడిన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయంతో తెలంగాణ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఆలా హోం కమింగ్ అంటూ తెలంగాణలో తెలుగుదేశం గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్న నేతలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. నిజానికి రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో పార్టీని వీడి ఇతర పార్టీలలో ఇమడలేక ఉక్కపోతకు గురౌతున్న పలువురు ఇప్పుడు తెలుగుదేశం వైపే చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వచ్చినట్లు కూడా చెబుతున్నారు.
తాజాగా గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. శనివారం (జూన్ 14) జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో వారి మధ్య జరిగిన చర్చ ఏమిటన్నది అలా ఉంచితే.. ఈ భేటీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయనడానికి తార్కానంగా నిలిచింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఓటమి తరువాత ఆయన ఫామ్ హౌస్ విడిచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అన్నిటికీ మించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన చిక్కులను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సైతం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణు ఎదుర్కొంటున్నారు. ఇక కేఃసీఆర్ కుమార్తె కవిత తీరు.. ఇలా ఏ విధంగా చూసినా ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది. అలాగే రాష్ట్రంలో అధికారంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అంతర్గత విభేదాలతో ఇబ్బందులు పడుతోంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంతో ప్రజా ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లలో ఉన్న పలువురు మాజీ తెలుగుదేశం నేతల అడుగులు హోంకమింగ్ అంటూ తెలుగుదేశం దిశగా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-telugu-desam-towards-its-former-glory-39-199966.html












