భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి : మంత్రి పొంగులేటి
Publish Date:Jul 30, 2026
Advertisement
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గురువారం రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, రాబోయే రెండు రోజుల్లో వర్షాల పరిస్థితిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం అందుబాటులో ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో 30 శాతం మేర ఉన్న వర్షపాతం లోటు, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గణనీయంగా తగ్గి దాదాపు సాధారణ స్థాయికి చేరుకుందని మంత్రి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం జూలై 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. Telangana rains, Hyderabad Meteorological Center, Red Alert, Adilabad rains, Severe Cyclone, Telangana Rains, Telangana Weather Update, IMD, Minister Ponguleti Srinivasa Reddy
http://www.teluguone.com/news/content/telangana-rains-36-227586.html





