డిల్లీలో ముగిసిన తెలంగాణా దీక్షలు
Publish Date:May 1, 2013
Advertisement
పార్లమెంటు ముందు తెలంగాణా కాంగ్రెస్ యంపీలు, జంతర్ మంతర్ వద్ద తెలంగాణా జేయేసీ నేతలు చెప్పటిన రెండు రోజుల దీక్షలు నేటితో ముగిసాయి. పార్లమెంటు మెట్ల మీద ఎంత పడిగాపులు గాసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తరపున ఏ ఒక్కరూ కూడా వచ్చికాంగ్రెస్ యంపీలను పరమార్శించడానికి రాలేదు. కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ అయినా వచ్చి తమతో మాట్లాడి సముదాయిస్తారని వారు ఆశించారు కానీ, ఆయన కూడా రాకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. తమ పట్ల అధిష్టానం ఇంత కటిన వైఖరి పాటిస్తుందని ఊహించకపోవడంతో తమ దీక్ష ముగిసేలోగా తప్పనిసరిగా అధిష్టానం తరపున తమతో మాట్లాడేందుకు ఎవరో ఒకరు వస్తారని ఆశగా ఎదురుచూసిన వారికి చివరికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో పార్టీకి అండగా నిలబడవలసిన కాంగ్రెస్ యంపీలే ఈ విధంగా సమస్యలు సృష్టించడంతో వారిపట్ల కాంగ్రెస్ అధిష్టానం కటినంగా వ్యవహరింఛి ఉండవచ్చును. ఇటీవల వారు తెరాస అధినేత కేసీఆర్ తో రహస్య సమావేశాలవడం, వారిలో కొందరు పార్టీ మారుతారనే వార్తలు మొదలయిన అంశాలు కూడా పార్టీ అధిష్టానానికి వారిపట్ల వ్యతిరేఖత ఏర్పరచి ఉండవచ్చును. రేపు టికెట్స్ కేటాయింపు సమయంలో కూడా పార్టీ ఇదే ధోరణి అనుసరిస్తుందా లేక ఈ కోపం తాత్కాలికమేనా అనేది రానున్న కాలమే చెపుతుంది. కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, బేనీ ప్రసాద్ వర్మ మాత్రం వారిని పలుకరించారు. సాటి తెలంగాణా మంత్రులయిన సర్వే సత్యనారాయణ మరియు బలరం నాయక్ లిరువురు తమను పరమార్శించలేదని తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రం నుండి కే.జానా రెడ్డి, అరెపల్లి మోహన్, ప్రవీణ్ రెడ్డి, శ్రీధర్ బాబు, భిక్షమయ్య తదితరులు తెలంగాణా యమ్పీలకు సంఘీభావం ప్రకటించేందుకు నిన్న డిల్లీ తరలి వెళ్ళారు. ఇక, జంతర్ మంతర్ వద్ద తెలంగాణా జేయేసీ నేతలు చెప్పటిన దీక్ష మాత్రం విజయవంతం అయిందని చెప్పవచ్చును. తెలంగాణకు మద్దతు ఇచ్చే అన్ని జాతీయ పార్టీల నేతలు వచ్చి వారి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న యన్.సి.పీ నేతలు కూడా ఈ దీక్షలో ఉత్సాహంగా పాల్గోనడమే కాకుండా, తెలంగాణా జేయేసీలో సభ్యత్వం కూడా స్వీకరించడం జేయేసీ నేతలకి ఉత్సాహం కలిగించింది. రాష్ట్రంలో బీజేపీతో పెట్టుకోబోమని తెరాస నిర్ద్వందంగా ప్రకటించినప్పటికీ, తెరాస ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ దీక్షకు సుష్మా స్వరాజ్ వంటి బీజేపీ నేతలు కూడా వచ్చి తమ మద్దతు తెలుపడం విశేషం. బహుశః రానున్న ఎన్నికలలో పొత్తులకు తాము సానుకూలమని తెలియజేసేందుకే వారు వచ్చి ఉండవచ్చును.
http://www.teluguone.com/news/content/telangana-congress-mps-39-22799.html





