పెట్రో ధరల పెంపుపై తెలంగాణ, తమిళనాడు సీఎంల ఫైర్
Publish Date:May 18, 2026
Advertisement
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని సోషల్ మీడియా ఎ వేదికగా రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ నిర్ణయంతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం పెట్రో ధరలు పెంచం అని పదే పదే ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు కూడా గడవకముందే ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే అని దుయ్యబట్టారు. మరోవైపు తమిళనాడు సీఎం విజయ్ కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తప్పుపట్టారు. కేంద్రం నిర్ణయం దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోందన్నారు. ఈ మేరకు కేంద్రానికి విజయ్ రాసిన లేఖలో.. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు లాభాలు పిండుకునే చమురు సంస్థలు.. ధరలు పెరిగినప్పుడు మాత్రం ఆ భారాన్ని ప్రజలపై మోపుతాయా? అని ప్రశ్నించారు. ఈ అనాలోచిత నిర్ణయం సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతుందన్న ఆయన.. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఇంధన ధరల పెంపును సమర్థించారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధ వాతావరణం.. అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గంలో ఉన్న ఆంక్షల కారణంగా పెంపు అనివార్యమైందన్నారు.
http://www.teluguone.com/news/content/telangana-and-tamil-nadu-cms-lash-out-at-petrol-price-hike-36-220122.html





