సీనియార్టీ, సిన్సియార్టీ.. పోరాటమే ఫార్ములా.. చంద్రబాబు హెచ్చరిక..
Publish Date:Apr 21, 2022
Advertisement
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తటస్థులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. పార్టీలో పనిచేసే యువ నేతలకూ అవకాశాలిస్తామన్నారు. ‘‘సీనియార్టీని గౌరవిస్తాం.. సిన్సియార్టీని గుర్తిస్తాం. సీనియార్టీ ఉన్నా ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభం? ఓట్లు వేయించలేని సీనియర్లకే ప్రాధాన్యమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం.’’ అని చంద్రబాబు అన్నారు. పార్టీలోని కొందరు నేతల పనితీరుపై చంద్రబాబు హెచ్చరికలు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ మాయచేసే నేతలకు చెక్ పెడతానన్నారు. పనిచేసే వారెవరో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చిందని చెప్పారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. సమాజహితం కోసం టీడీపీ అవసరముందని.. అందుకే విరాళాలు సేకరిస్తున్నామని చెప్పారు. పార్టీకి విరాళాలు వస్తే కొంతమందికైనా సాయం చేయొవచ్చు అన్నారు. పార్టీలో ఏ పదవులు రావాలన్నా సభ్యత్వంతోనే ముడిపడి ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. వాట్సాప్ ద్వారా సభ్యత్వాన్ని పొందేలా ప్రణాళికలు చేశామన్నారు. తమ ప్రణాళికను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఆరోపించారు. వాట్సాప్ యాజమాన్యానికి వైసీపీ ప్రభుత్వం 4 పేజీల లేఖ రాసిందని.. సభ్యత్వానికి కావాల్సిన టెక్నాలజీపై సందేహాలపై ప్రభుత్వమే తమను అడిగితే సమాధానం చెబుతామన్నారు లోకేశ్.
వైసీపీ అరాచక పాలనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకునేందుకు అందరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భయపడితే మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతింటామని.. పోరాటాన్ని ఆయుధంగా మార్చుకోవాలని సూచించారు. అలా ముందుకొచ్చిన వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/tdp-membership-program-25-134739.html





