జగన్ ఇంటి కిటికీలు, బోల్టులకు 73లక్షలా? ఎంత మోసమంటూ నారా లోకేష్ ఎద్దేవా
Publish Date:Nov 7, 2019
Advertisement
ప్రజాధనాన్ని సొంత పనులకు వాడుకోవడంలో ఎవరూ తక్కువ కాదని నిరూపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలే చేసిన జగన్... తాను అధికారంలోకి వచ్చాక, అదే పని చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ మరమ్మతులు కోసం 73లక్షల రూపాయలు మంజూరు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అది కూడా కేవలం కిటికీలు, తలుపులు కోసం దగ్గరదగ్గర కోటి రూపాయలు కేటాయించడాన్ని జాతీయ మీడియా తప్పుబడుతోంది. కిటికీలు, తలుపులు కోసం ఏకంగా 73లక్షలు మంజూరు చేస్తారా? అంటూ విస్తృతంగా కథనాలు ప్రసారం చేస్తున్నారు. దాంతో, జగన్ క్యాంప్ హౌస్ మరమ్మతు వ్యవహారం అటు జాతీయ మీడియాలోనూ... ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. జగన్ క్యాంపు కార్యాలయం కిటికీలు, తలుపులకు 73లక్షల రూపాయలు కేటాయిస్తూ జీవో ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. డబ్బుల్లేవు... డబ్బుల్లేవు అంటూ నిత్యం డైలాగులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి... తన ఇంటి కిటికీలు, బోల్టులకు మాత్రం లక్షల లక్షల రూపాయలు మంజూరు చేసుకుంటున్నారని మండిపడ్డారు. అన్ బిలీవబుల్... మైండ్ పోతోంది... జగన్ ఇంటి కిటికీలకు 73లక్షలా? అంటూ లోకేష్ విస్మయం వ్యక్తంచేశారు. కిటికీలకు బోల్టులకు లక్షల లక్షలు తగలబెడుతూ... పైకి మాత్రం నెలకు రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానంటూ సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి 73లక్షల రూపాయలను తన సొంత ఇంటి కోసం ఖర్చుపెట్టడం మోసం కాదా అంటూ ప్రశ్నించారు. అయితే, అప్పుడు టీడీపీ... ఇప్పుడు వైసీపీ... అప్పుడు చంద్రబాబు... ఇప్పుడు జగన్... ఇద్దరూ కూడా ప్రజాధనాన్ని సొంత అవసరాల కోసం మరమరాల్లాగా ఖర్చుపెట్టడంలో ఎవరూ తక్కువ కాదని... అంటున్నారు.
http://www.teluguone.com/news/content/tdp-leader-nara-lokesh-slams-ap-cm-ys-jagan-39-90959.html





