వైసీపీలోకి గొట్టిపాటి..! బాబు పిలిచి మాట్లాడినా...?
Publish Date:Nov 7, 2019

Advertisement
గొట్టిపాటి రవికుమార్... అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే... 2004లో కాంగ్రెస్ నుంచి... 2014లో వైసీపీ నుంచి... 2019లో టీడీపీ నుంచి... మొత్తంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి... ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్... అప్పటి రాజకీయ పరిస్థితులు, వ్యాపార ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంలో చేరారు. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి... మూడోసారి అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఏ కారణాలతోనైతే ఆనాడు టీడీపీలో చేరారో... ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో... మళ్లీ అదే పరిస్థితులు గొట్టిపాటికి ఎదురవుతున్నాయట. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నప్పటికీ, స్థానిక రాజకీయ పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేకపోవడంతో... మళ్లీ వైసీపీ గూటికి చేరాలని భావిస్తున్నారట. వైసీపీ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.
అయితే, గొట్టిపాటి రవికుమార్ ఆలోచనను తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక... నియోజకవర్గంలో ఎదురవుతోన్న కష్టాలు... వ్యాపారపరంగా కలుగుతున్న ఇబ్బందులు... మరోవైపు కేసులు... ఇలా తన ఇక్కట్లపై గొట్టిపాటి ఏకరువు పెట్టారట. ముఖ్యంగా తనకున్న గ్రానైట్ వ్యాపారంపై విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని, దాంతో బల్లికురవ, చీమకుర్తిలో బిజినెస్ నిలిచిపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. అయితే, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన చంద్రబాబు.... పార్టీ మారాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించారట.
చంద్రబాబు బుజ్జగించినా, అండగా ఉంటామని భరోసా కల్పించినా, గొట్టిపాటి మాత్రం పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు, వ్యాపారపరంగా ఇబ్బందులు ఒకటైతే... మరోవైపు జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమంటున్నారు. ఇప్పటికే తన అనుచరులతో గొట్టిపాటి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి గొట్టిపాటి పార్టీ మారడం ఖాయమే అయినా... అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
http://www.teluguone.com/news/content/addanki-tdp-mla-gottipati-ravikumar-to-join-ysrcp-39-90962.html












