రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే సవాల్ కు మంత్రి లోకేష్ సై
Publish Date:Dec 19, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి విషయంలో తనతోనే పోటీ పడతానంటూ సవాల్ చేసిన పార్టీ ఎమ్మెల్యేను అభినందించారు. మనస్ఫూర్తిగా ఆ సవాల్ ను స్వీకరిస్తున్నానని సభా ముఖంగా ప్రకటించారు. ఇంతకీ విషయమేంటంటే.. రాజమహేంద్రవరంలో శుక్రవారం (డిసెంబర్ 19) పర్యటించిన నారా లోకేష్ అక్కడ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను నారా లోకేష్ తో పోటీ పడతానని అన్నారు. దీనికి నారా లోకేష్ చాలా చాలా సానుకూలంగా స్పందించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలతో మమేకమౌతూ ముందుకు సాగాలన్న లోకేష్.. ఆదిరెడ్డి వాసు కుటుంబం కష్ట సమయంలో తమకు అండగా ఉందని చెప్పారు. జగన్ హయాంలో చంద్రబాబును అక్రమంగా రాజమహేంద్రవరం జైల్లో నిర్బంధించిన సమయంలో ఆదిరెడ్డి కుటుంబం తమకు అండగా నిలిచిందని చెప్పారు. ఆయనను తాను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. జగన్ ను సైకోగా అభివర్ణించారు. సైకో ఇంకా అరెస్టులు చేస్తానంటూ చేస్తున్న బెదరింపులను ఖండించారు. అధికారంలో ఉండగా వైనాట్ 175 అంటూ గప్పాలు కొట్టిన వారు, గత ఎన్నికలలో టీమ్ 11 కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు.
http://www.teluguone.com/news/content/lokesh-accept-tdp-mlas-challange-39-211290.html





