టీడీపీ తొలి మహానాడు ఎలా జరిగిందో తెలుసా?
Publish Date:May 27, 2021

Advertisement
తెలుగు దేశం పార్టీ పండుగలా నిర్వహించే మహనాడు ప్రారంభమైంది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఈసారి డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ లోనే కార్యక్రమాలన్ని జరుగుతున్నాయి. ప్రత్యేక అనుమతులు తీసుకోవడం ద్వారా ఎనిమిది నుంచి పది వేల మంది ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో నమోదు చేసుకొని పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఈసారి మొత్తం 15 తీర్మాణాలు చేయనున్నారు. ఇందులో పది తీర్మానాలు ఆంధ్రప్రదేశ్... ఐదు తీర్మానాలు తెలంగాణకు సంబంధించినవి.
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు పుట్టిన రోజు సందర్భంగా మహానాడు సమావేశాలు నిర్వహించడం టీడీపీలో ఆనవాయితీగా వస్తోంది. తెలుగు దేశం పార్టీ తొలి మహానాడును 1983 మే 26, 27, 28 తేదీల్లో నిర్వహించారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే టీడీపీ తొలి మహానాడు జరగడంతో... ఎంతో అట్టహాసంగా జరిగింది. తెలుగు తమ్ముళ్లు పండుగలా భావించారు.
గుంటూరులోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభ జరిగింది. చివరిరోజైన మే 28న భవానీపురం మీదుగా బందర్ రోడ్డు వరకు బ్రహ్మండమైన ఊరేగింపు జరిగింది. తెలుగు తమ్ముళ్ల ర్యాలీతో గుంటూరు మొత్తం పసుపుమయంగా మారిందని చెబుతారు. అదే రోజు సాయంత్రం శాతవాహన్ నగర్ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.
తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలు అప్పట్లో దేశంలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా క్రేజీ వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు ఆయన కేంద్రంగా మారిపోయారు. అందుకే తెలుగు దేశం మహాసభలకు ఎన్టీఆర్ పిలవగానే.. అప్పటి కాంగ్రెసేయేతర పార్టీల నేతలంతా గుంటూరు వచ్చేశారు.
అప్పటి రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు వచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్న, మేనకాగాంధీలు హాజరయ్యారు. ఒక రకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలంతా తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలకు రావడం అప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం వచ్చిన ప్రతినిధుల కోసం ప్రత్యేక కుటీరాలు నిర్మించారు. మహానాడుకు వచ్చిన జాతీయ నేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ మహానాడులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అప్పటి ప్రముఖ సినీ కళాకారులు వినోద కార్యక్రమాలతో అలరించారు. మొత్తంగా 1983 మే26,27,28 తేదీల్లో గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రధమ మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయని అంటారు.
http://www.teluguone.com/news/content/tdp-first-mahanadu-held-in-guntur-in-1983-39-116349.html












