ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. విపక్షాల ఒత్తిడితో వెనక్కి తగ్గిన సర్కార్
Publish Date:May 27, 2021
Advertisement
తెలుగుదేశం పార్టీ సహా విపక్షాల పోరాటానికి జగన్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గింది. పదో తరగతి పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలన్ని పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పరీక్షలు కూడా రద్దు కావడం జరిగిందన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టు వీడకండా వ్యవహరించింది. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాడమాడుతుందనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున పరీక్షలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటు న్యాయ పోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులూ పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఎట్టకేలకు వాయిదా వేసింది. కరోనా విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ పరీక్షల తేదీలను కరోనా తగ్గుముఖం పట్టాక ప్రకటిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు పదో తరగతి పరీక్షలపై జులైలో మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. ఇంటర్ పరీక్షలపై కూడా ఆ నెలలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. దీంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని కూడా చెప్పింది. ఉపాధ్యాయులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించలేదంటూ దాఖలైన అఫిడవిట్‌పై విచారణ ముగించాలని ప్రభుత్వ తరపు లాయర్ హైకోర్టును కోరారు. అయితే పరీక్షల వాయిదా, స్కూళ్లు తెవబోమని అఫిడవిట్ వేయాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/ap-ssc-exams-postpone-39-116352.html





