సీఎం జగన్ పై కేసు పెట్టాలి! రుయా హాస్పిటల్ లో మరణ మృదంగం
Publish Date:May 11, 2021
Advertisement
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మందిపైగా మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. రుయాలో ఇప్పటికి పరిస్థితులు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. రుయా ఘటనపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఆక్సిజన్ అందక చనిపోయిన వారివన్నీ ప్రభుత్వ హత్యలే అని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన చేతకాని పాలనతో ప్రజల ప్రాణాలు తీస్తున్న ముఖ్యమంత్రి జగన్పై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నారు తప్ప, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సీజన్ ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. హాస్పిటల్లలో రోగులకు సరిపడా మందులు లేవని, ఆక్సిజన్ లేదని, బెడ్లు లేవని, ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు చనిపోతున్నా జగన్ రెడ్డికి మాత్రం కనీస మానవత్వం లేదని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే జగన్ రెడ్డి రాజీనామా చేయాలి తప్ప ప్రజల ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసమని అచ్చెన్న ప్రశ్నించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అచ్చెన్నాయుడు . చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కోవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను గవర్నర్ ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/tdp-demand-case-on-cm-jagan-on-ruia-incident-39-115193.html





