విచా 'రణం'.. వాసిరెడ్డి పద్మకు విచారం!!
Publish Date:Apr 27, 2022
Advertisement
వాసిరెడ్డి పద్మ. ఒకప్పుడు వైసీపీ మౌత్‌పీస్. ఇప్పుడు ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్. కుర్చీని చూసుకొని పరిధి దాటారు. అధికారం లేకపోయినా.. కావాలనే టార్గెట్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమలకు నోటీసులకు ఇచ్చారనే విమర్శ. ఏప్రిల్ 27 విచారణకు హాజరుకావాలనే ఆదేశం. వచ్చేదేలే.. అంటూ ముందే తేల్చి చెప్పింది టీడీపీ. అన్నట్టుగానే.. విచారణకు హాజరుకాలేదు ఆ ఇద్దరు. చేసేదేముంది.. ఏమీ లేదని ఆమెకూ తెలుసు. కానీ, విచారణకు రానందున చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అంటున్నారు. న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తనను దూషించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమాకు వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం వారు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు లేదని టీడీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. అన్నట్టుగానే విచారణకు గైర్హాజరు అయ్యారు. ఇక, బుధవారం ఉదయం మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించారు. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు.. తెలుగు మహిళలను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు సైతం నిరసనకు జత కలిశారు. ఉద్రిక్తత పెరగడంతో పరిమిత సంఖ్యలో మహిళలను కార్యాలయంలోకి అనుమతించారు. వాసిరెడ్డి పద్మకు వారు విజ్ఞాపన పత్రం అందజేశారు. విజయవాడతో సహా అన్ని అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’’ అనే పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందించారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని వాసిరెడ్డి పద్మ చెప్పారు.
http://www.teluguone.com/news/content/tdp-angry-on-vasireddy-padma-25-135075.html





