మదర్సాలు జీహాదీలను తయారు చేసే కర్మాగారాలు.. తస్లిమా నస్రీన్.!
Publish Date:Aug 3, 2026
Advertisement
ప్రముఖ ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు, మదర్సాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మదర్సాలను జిహాదీ కర్మాగారాలుగా అభివర్ణించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న తీవ్రమైన వివక్షను రూపుమాపాలంటే భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో కూడా ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడమొక్కటే మార్గమన్నారు. కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా పౌరులందరికీ సమానమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న తస్లీమా.. ఇండియాలో మాత్రం మహిళలు ఇప్పటికీ చట్టపరంగా, సామాజికంగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో మహిళల హక్కులను కాలరాయడం సహించరానిదన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదాను సమగ్రంగా పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తస్లీమా చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందూ మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కులు లేవనీ, ఇటువంటి వివక్షతతో కూడిన నిబంధనలను తొలగించాలంటే ఉమ్మడి పౌర స్మృతి వంటి చట్టాలు అవసరమన్నారు. నిజమైన ఆధునికత సమాజంలో లింగ సమానత్వం ద్వారానే వస్తుందన్నారు. విద్యార్థులకు లౌకిక, ఆధునిక విద్యను అందించకుండా మతపరమైన మూఢత్వాన్ని నూరిపోసే మదర్సాలను తొలగించాలని డిమాండ్ చేశారు. 2007లో తస్లీమా రాసిన ద్విఖండితో (Dwikhandito) అనే తన ఆత్మకథ పుస్తకంలోని కొన్ని భాగాలపై తీవ్ర నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఆ పరిస్థితుల్లో తస్లిమా భద్రతా కారణాల దృష్ట్యా కోల్‌కతాను విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ తనకిష్టమైన నగరానికి చేరుకోవడం, ప్రజాస్వామ్య బద్ధమైన భావప్రకటన స్వేచ్ఛకు దక్కిన విజయంగా చెప్పవచ్చు. ఇండియాలో పౌర సంబంధాలు మరియు ఉమ్మడి పౌర స్మృతిపై విస్తృత చర్చ జరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తస్లిమా నస్రీన్ ఉమ్మడి పౌర స్మృతికి విస్పష్ట మద్దతు తెలపడం, మదర్సాల తీరును ఎండగట్టడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. Taslima Nasreen, Uniform Civil Code, Madrasa Controversy, Kolkata Visit, UCC Support
మదర్సాల నిర్వహణపై మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో మదర్సాల అవసరమే లేదని, అవి అసలు కొనసాగకూడదన్నారు.
http://www.teluguone.com/news/content/taslima-nasreen-36-227837.html





