కరూర్ సభలో కన్నీటి పర్యంతమైన తమిళనాడు సీఎం విజయ్.!
Publish Date:Jul 10, 2026
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ కరూర్ వేదికగా భావోద్వేగ పూరితంగా చేసిన ప్రసంగం దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ సభలో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల ప్రచారం సమయంలో విజయ్ కరూర్ పర్యటనలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. బాధితుల కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి బాధితుడి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గురువారం(జులై 9) ఆయన కరూర్ లో పర్యటించి.. బాధితుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. నాటి తొక్కిసలాట సంఘటన తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేని విషాద ఘటనగా అభివర్ణించారు. నాటి సంఘటనను తలచుకుంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. తనను నమ్మి ఆ సభకు వచ్చిన వారిని కాపాడుకోలేకపోయానన్నారు. తనను నమ్మినందుకే వారు బలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం అంటే కేవలం అధికార పీఠాన్ని దక్కించుకోవడం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలకు బాధ్యత వహించడం అన్నారు. బాధితుల కుటుంబాలలో కనీసం ఒకరికైనా స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం ద్వారా ఆయా కుటుంబాల భవిష్యత్తుకు పూర్తి ఆర్థిక భరోసా దొరికినట్లయింది. విజయ్ చూపిన ఈ మానవత్వపు చొరవపై సామాన్య ప్రజల నుంచీ, రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. Vijay Emotional Speech, Tamil Nadu CM Vijay, Stampede Victims Jobs, Thalapathy Vijay TVK
http://www.teluguone.com/news/content/tamil-nadu-cm-vijay-moved-to-tears-at-the-karur-meeting-36-225636.html





