తెరాస వ్యూహానికి తెదేపా చెక్!
Publish Date:Nov 5, 2015
Advertisement
ఇంతకు ముందు తెదేపాలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తెరాస ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ఇంతవరకు తన రాజీనామాను స్పీకర్ చేత ఆమోదింపజేసుకోకపోవడం చేత ఆయనే నేటికీ సనత్ నగర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సనత్ నగర్ నియోజక వర్గంలో ఆంధ్రాకు చెందిన ప్రజలు చాలా మంది స్థిరపడున్నారు. ఇదివరకు తలసాని తెదేపాలో ఉన్న కారణంగా వారు ఆయనకు ఓటు వేసి గెలిపించారు. కానీ ఆయన తెదేపాలో ఉంటారని భావించి ఓట్లు వేసి గెలిపిస్తే, తమ అభీష్టానికి విరుద్దంగా ఆయన తెరాసలో చేరడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కనుక ఆయన మళ్ళీ సనత్ నగర్ నుంచి పోటీ చేస్తే వాళ్ళ ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉండకపోవచ్చును. బహుశః ఆ భయంతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇంతవరకు ఆమోదింపజేసుకోలేదని భావించవచ్చును. కానీ ఏదో ఒకనాడు అదే సనత్ నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయక తప్పదు. ఆయన తెదేపాను వీడి తెరాసలో జేరినప్పుడు ఆయనతో బాటు ఆయన అనుచరులు కూడా తెరాసలో చేరారు. అయితే నేటికీ సనత్ నగర్ నియోజక వర్గంలో తెదేపా చాలా బలంగానే ఉంది. కనుక ఈ పరిస్థితిలో తెదేపాను బలహీనపడితే తప్ప అక్కడ తలసాని విజయం సాధించడం అసంభవం. అందుకే సనత్ నగర్ నియోజక వర్గానికి తెదేపా ఇన్-చార్జ్ గా వ్యవహరిస్తున్న కూన వెంకటేష్ గౌడ్ ని తెరాసలోకి ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయి. వెంకటేష్ గౌడ్ తెదేపాకు గుడ్ బై చెప్పి తెరాసలోకి వెళ్లిపోబోతున్నారని ఆ మధ్యన మీడియాలో వార్తలు వచ్చేయి. తెదేపా కూడా దీనికి విరుగుడుగా ఒక వ్యూహం అమలు చేస్తోంది. సనత్ నగర్ నియోజక వర్గానికి జరుగబోయే ఉప ఎన్నికలలో తెదేపా అభ్యర్ధిగా కూన వెంకటేష్ గౌడ్ నే నిలబెట్టాలని నిశ్చయించుకొంది. దానితో తెరాస వ్యూహం బెడిసి కొట్టినట్లయింది. ఎవరిని తమ పార్టీలోకి ఆకర్షించాలని అనుకొందో వారితోనే తలపడాల్సిన పరిస్థితి ఎదురయింది. అసలు ఆయన గత ఎన్నికలలోనే సనత్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సీటును తలసానికి ఇవ్వవలసి వచ్చింది. కానీ ఆయన తెదేపాకు హ్యాండిచ్చి తెరాసలోకి వెళ్ళిపోయారు. తనకు దక్కవలసిన సీటును తలసాని దొంగిలించుకొని పారిపోయారని వెంకటేష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఈసారి తనకే సనత్ నగర్ నుండి పోటీ చేసే అవకాశం ఇస్తామని తెదేపా అధిష్టానం స్పష్టమయిన హామీ ఇవ్వడంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. గత శుక్రవారం బేగంపేటలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలు నేతల సమావేశంలో కూన వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ “నేను పార్టీని వీడుతానని మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. నా చివరి శ్వాస వరకు తెదేపాలోనే కొనసాగుతాను. పార్టీ కోసం పనిచేతూనే ఉంటాను. ఆదరించిన పార్టీని మోసం చేసి తెరాసలో వెళ్ళిన వారందరికీ ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలి. తెలంగాణాలో, మన నియోజక వర్గంలో తెదేపాను పటిష్టపరిచేందుకు మనమందరం కలిసి కృషి చేయాలి,” అని కోరారు.
http://www.teluguone.com/news/content/talasani-srinivas-yadav-45-52036.html





