ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..
Publish Date:Jan 21, 2022
Advertisement
అబ్ ఆయేగా మజా. బద్ద శత్రువులైన ఇండియా, పాకిస్తాన్‌లు ఒకే గ్రూపులో పడ్డాయి. ఇక టీ20 వరల్డ్ కప్‌లో అసలు సిసలు దాయాదుల యుద్ధం జరగనుంది. పాక్‌కు పాత బాకీ చెల్లించాల్సి ఉంది. కెప్టెన్సీ లేని కసిలో విరాట్ కోహ్లీ రగిలిపోతున్నారు. తన కోపాన్నంతా పాకిస్తాన్‌పై తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. గత టీ20 వాల్డ్ కప్‌లో భారత్.. గ్రూప్ స్టేజ్ దశకే పరిమితమైంది. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో ఓటమి ఎరగని టీమ్‌ఇండియా.. అప్పటి తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయి పరువంతా పోయింది. ఈ సారైనా పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని.. ఇండియన్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు. అయితే దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ టీ20 సహా అన్ని ఫార్మాట్‌ల సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికేశాడు. కొత్త కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈసారి టీమ్‌ఇండియా బరిలోకి దిగబోతోంది. మరోవైపు, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ గైడెన్స్‌లో తొలిసారి భారత్ ఐసీసీ ట్రోఫీలో తలబడబోతోంది. సో, ఇది రోహిత్‌తో పాటు ద్రవిడ్‌కూ ఛాలెంజింగ్ కప్పే. ఇంతకీ.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఎప్పుడంటే... ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టోర్నీ జరగనుంది. 16 నుంచి 21 వరకు క్వాలిఫైయింగ్ మ్యాచులు జరగుతాయి. అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 22న తొలి మ్యాచ్‌లో గతేడాది టీ20 వరల్డ్‌కప్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో తలపడుతుంది. గ్రూప్-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. అక్టోబర్ 23న తొలిపోరులో దాయాది పాకిస్థాన్‌ను టీమిండియా ఢీకొనబోతోంది. ఇక నవంబర్ 9న సిడ్నీ వేదికగా తొలి సెమీఫైనల్ ఉంటే.. నవంబర్ 10న అడిలైడ్ వేదికగా రెండో సెమీస్ ఉంటుంది. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ జరగనుంది. 2007 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు టీ20 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను ధోనీ సారథ్యంలోని భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ రెండుసార్లు, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా చెరోసారి విజేతలుగా నిలిచాయి. మరి, ఈసారి గెలుపెవరిదో..?
http://www.teluguone.com/news/content/t20-world-cup-schedule-released-25-130500.html





