రాజద్రోహ చట్టంపై స్టే- సుప్రీం చారిత్రాత్మక నిర్ణయం
Publish Date:May 11, 2022
Advertisement
తస్మదీయులను వేధించడానికి దేశ ద్రోహం కేసును ఉపయోగించుకోవాలనుకునే ప్రభుత్వాలకు సుప్రీం చెక్ పెట్టింది. కాలం చెల్లిన ఈ చట్టంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. ఇకపై రాజద్రోహం కేసులు నమోదు చేయవద్దనీ, ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దనీ విస్పష్ట ఆదేశాలిచ్చింది. రాజ ద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ సుప్రీం కోర్టు చారిత్రక ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ ఎన్నీ రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం దేశద్రోహ చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకూ ఆ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయవద్దని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ చట్టం కింద కేసులు నమోదై, జైళ్లలో ఉన్న వారు బెయిలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే ఇప్పటికే నమోదైన కేసులలో ఎటువంటి చర్యలూ తీసుకోరాదని విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. రాజద్రోహ చట్టం సెక్షన్ 124ఎ అమలుపై స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై పున:పరిలీలన పూర్తయ్యే వరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వలసపాలకులు పోయినా, నాటి వలస చట్టాన్ని ఇంకా దాన్ని కొనసాగించడంపై ఆలోచించాలని కొంత కాలంగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్న సంగతి విదితమే. మరోవైపు రాజద్రోహం కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్రం సుప్రీంకు తెలియజేయడంతో.. సమీక్ష పూర్తయ్యే వరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయరాదంటూ, ఇప్పటికే నమోదైన కేసులలో ఎలాంటి చర్యలూ తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. రాజద్రోహ చట్టాన్ని వేధింపుల కోసం దుర్వినియోగం చేసిన ఘటనలు ఏపీలో ఇటీవల చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామరాజుపై రాజద్రోహ నేరం కింద కేసు నమోదు చేసింది జగన్ సర్కార్. అలాగే రఘురామ రాజు ప్రసంగాలను ప్రసారం చేసినందుకు రెండు ప్రముఖ చానళ్లపై కూడా జగన్ సర్కార్ రాజద్రోహ నేరం కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై ఆ చానెళ్లు సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. ఇలా ఉండగా రాజద్రోహం కేసుపై సుప్రీం స్టే విధించడం చరిత్రాత్మకమని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమను వ్యతిరేకించే వారిపైనా, తమ విధానాలను విమర్శించేవారిపై రాజద్రోహ నేరంకింద కేసుపెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రఘురామ రాజు అన్నారు. అందుకు తనపై పెట్టిన తనపై రాజద్రోహం కేసే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం మీడియా, ఇతరులపై కూడా రాజద్రోహం కేసు పెట్టిందని గుర్తు చేశారు. రాజద్రోహ చట్టం సెక్షన్ 124ఎ కింద కేసులు నమోదు చేయవద్దంటూ సుప్రీం కోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని రఘురామ పేర్కొన్నారు.
ఇదే చట్టం కింద దేశంలో గత పదేళ్లలో 13వేల 306 కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో శిక్షలు పడినవి చాలా చాలా తక్కువ. కాగా ఈ చట్టాన్ని అలహాబాద్ హైకోర్టు గతంలోనే కొట్టేసింది. రాజద్రోహం చట్టాన్ని అడ్డు పెట్టుకొని దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు తప్పుడు కేసులు పెడుతున్నాయనే విమర్శలున్నాయి.
http://www.teluguone.com/news/content/supreme-stay-on-sedition-law-25-135745.html





