కోడికత్తి శ్రీను బెయిలు రద్దు పిటిషన్ వెనుక ఎన్ఐఏ ఉద్దేశం ఏంటి?
Publish Date:Jul 16, 2024
Advertisement
2019 ఎన్నికల ముందు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసు మాత్రం జీడిపాకంలా సాగుతూనే ఉంది. విస్తృత కుట్ర కోణం ఉందంటూ ఈ కేసులో ఐదేళ్లు జైల్లో మగ్గిన నిందితుడు శీనుకు బెయిలు రాకుండా అడ్డుకునేందుకు జగన్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాధితుడిగా ఐదేళ్లలో ఒక్క సారి కూడా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి ఇష్టపడని జగన్ ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీని బయటకు రాకుండా ఉండాలని గట్టిగా భావించారు. జగన్ డిమాండ్ మేరకే కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ కోడికత్తి దాడి వెనుక ఎటువంటి రాజకీయ కుట్ర లేదని విస్పష్టంగా తేల్చేసినా, జగన్మోహన్ రెడ్డి మాత్రం విస్తృత కుట్ర కోణం అంటూ కేసును పొడిగించి, ఈ కేసులో నిందితుడు జైల్లోనే మగ్గిపోవాలన్నట్లుగా వ్యవహరించారు. ఈ కేసులో దాడి బాధితుడిగా జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకుండా ఈ కేసులో నిందితుడు ఐదేళ్లు జైల్లో మగ్గిపోవడానికి కారణమయ్యారు. అంటే జగన్ ఏనాడూ విచారణకు హాజరు కాకుండా, నిందితుడు శ్రీనును జైల్లోని బయటకు రాకుండా చేశారు. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో శ్రీను బయటకు రాగలిగాడు. అయితే నిందితుడి బెయిలు రద్దు చేయాలంటూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఎన్ఐఏ పిటిషన్ ను కొట్టివేసింది. బెయిలు రద్దు చేయలేమని విస్పష్టంగా పేర్కొంది. అయితే ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం లేదని విస్పష్టంగా చెప్పిన ఎన్ఐఏ. ఈ కేసుకు సంబంధించి నిందితుడు శ్రీనుని ఇంకా విచారించాల్సిన అవసరం లేదని తేల్చేసిన ఎన్ఐఏ ఇప్పుడు అతని బెయిలు రద్దు చేయాలని ఎందుకు సుప్రీంను ఆశ్రయించింది. ఎన్ఐఏ సుప్రీం కోర్టులో శ్రీను బెయిలు రద్దు పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. ఈ కేసు విచారణ పూర్తవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే చాలని ఎన్ఐఏ పలు మార్లు కోర్టుకు విన్నవించింది. అయితే ఇంత కాలం జగన్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా తనకు క్షణం తీరిక ఉండదనీ, అందువల్ల కోర్టుకు హాజరు కాలేనని చెబుతూ వచ్చారు. ఇక ఇప్పుడు ఇంతకాలం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నందున తీరిక లేక విచారణకు హాజరు కాలేకపోతున్నారని చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అందుకే ఇప్పుడు ఆయన కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరలేరు. ఈ కారణంగానే జగన్ ను కోర్టుకు రప్పించే ఉద్దేశంతోనే ఎన్ఐఏ కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిలు రద్దు కోసం సుప్రీంను ఆశ్రయించిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే రాజకీయవర్గాలలో మాత్రం ఎన్ఐఏ బెయిలు రద్దు పిటిషన్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ను ఎన్ఐఏ కోర్టుకు రప్పించాలంటే శ్రీను బెయిలు రద్దు అవసరం లేదని అంటున్నారు. అధికారంలోకి రావడం కోసం, అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీని ఇబ్బందులలోకి నెట్టడం కోసం జగన్ కోడికత్తి కేసును ఉపయోగించుకున్నారు. అందుకే కేసు తేలకుండా కొనసాగుతూనే ఉండేలా జగన్ వ్యవహరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఈ కేసు లాజికల్ ఎండ్ కువచ్చేస్తే.. తన ఆబోరు దక్కదన్న ఆందోళనలో జగన్ ఉన్నారు. అందుకే ఈ కేసు విచారణ సాగుతూనే ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పడు ఎన్ఐఏ సుప్రీంలో కోడికత్తి శ్రీను బెయిలు రద్దు పిటిషన్ దాఖలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. సరే ఎన్ఐఏ పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. ఇక కోడి కత్తి కేసు విచారణ జరిగితే జగన్ కోర్టుకు హాజరై తీరాల్సిందే. అందుకు ఎటువంటి మినహాయింపులూ లభించవు అనడంతో సందేహం లేదు. కేసు విచారణకు కోడికత్తి శ్రీను బెయిలు రద్దు అవసరం లేదు. విచారణకు హాజరు కావాలన్న నోటీసు ఇస్తే చాలు. ఇప్పుడిక ఎన్ఐఏ ఎంత తొందరగా ఈ కేసు విచారణ ముగిస్తుందన్నది చూడాలి.
http://www.teluguone.com/news/content/supreme-reject-nia-petition-25-180824.html





