ఛీ ఛీ.. కొవిడ్ నిధులూ కొట్టేసిన జగనన్న!.. ఆర్థికం అధ్వాన్నం
Publish Date:Apr 14, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ అనగానే, ఎవరికైనా అప్పులే గుర్తుకు వస్తాయి. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ళ పాలనలో ఏమి సాధించింది అంటే, అప్పుల్లో అగ్రస్థానం సంపాదించింది, అనే సమాధానమే ప్రధానంగా వినివస్తోంది. అలాగే, అప్పులు చేయడంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తనకు తానే సాటని నిరూపించుకున్నారు.అందుకే కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణలోనూ, వద్దన్నా బుగ్గనకు మళ్ళీ ఆర్థిక శాఖని అప్పగించారు. బొత్స, పెద్దిరెడ్డి వంటి సీనియర్ల శాఖలు మార్చినా బుగ్గన శాఖను మాత్రం మార్చలేదు. నిజానికి, మంత్రి పదవి ఇవ్వక పోయినా ఫర్వాలేదు కానీ, ఆర్థిక శాఖ మాత్రం వద్దని బుగ్గన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వార్తలొచ్చాయి. అయినా, చివరకు, ‘వీర దండం’ నుంచి ఆయన తప్పించుకోలేక పోయారు. అది ఆయన మెడకే చుట్టుకుంది. అదెలా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇంకో పెద్ద చిక్కు వచ్చిపడింది. నిజానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో అప్పులు అదుపులో ఉంచుకోమని, ఏపీ ప్రభుత్వాని హెచ్చరించింది. నిజం అవునో కాదో కానీ, ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక దారిలో పరుగులు తీస్తోందని ఆర్థిక శాఖ అధికారులు హెచ్చరించిన నేపధ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని మరీ అప్పులు అదుపులో పెట్టుకోమని, ఆర్థిక క్రమ శిక్షణ పాటించమని గట్టిగా అక్షింతలు వేసి పంపారని, మీడియాలో వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి ఆ వార్తలను ఖండించారు, అనుకోండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అంతకు మించిన షాక్ ఇచ్చింది. కేంద్ర నిధులను ఇష్టారాజ్యంగా దారి మళ్ళించడం కుదరదని కుండ బద్దలు కొట్టింది. అంతే కాదు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్)కి కేటాయించిన నిధులను, పీడీ ఖాతాలకు మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయ స్థానం నిలుపు చేసింది.ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, నిధుల దారి మళ్లింపు రాజ్యంగ విరుద్ధమని చెపుతూ, జగన్ రెడ్డి ప్రభుత్వం నెత్తిన మొట్టి కాయలు వేసింది. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా తప్పు పట్టింది. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ కోర్టుకు తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఎస్టీఆర్ఎప్ నిధులను దారి మళ్లించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు నిధులు మళ్లిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న, ఆర్థిక /అప్పుల విధానాన్ని పలి సందర్భాలలో తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం అనేకమార్లు హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణ గీత దాటిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బడ్జెట్ వెలుపల అప్పులు చేసినట్లు కాగ్’ ధృవీకరించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి కార్పొరేషన్‌లు, కంపెనీల పేరుతో రూ.56,076 కోట్లు అప్పుగా తీసుకుందని కేంద్రం తెలిపింది.గతేడాది రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. వివిధ బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో ఎక్కువగా ఎస్‌బీఐ నుంచి అత్యధికంగా రూ.15,000 కోట్లకుపైగా తీసుకుంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 7వేల కోట్లు, యూబీఐ నుంచి రూ.6,800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.5,700 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.4వేల కోట్లకుపైగా ఏపీ అప్పు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేస్తోందని, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలుగు దేశం, బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలనే డిమాండ్ ఎప్పటినుంచో వుంది అయినా, కేంద్రం ఎందుకనో, హెచ్చరికలతోనే సరిపెడుతోంది కానీ,కఠిన చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దొరికిన కాడికి అప్పులు చేసి ఓటు బ్యాంకు పథకాలకు ఖర్చు చేస్తోంది. అందుకే ఏపీలో ఏ.. అంటే అప్పులు, పీ.. అంటే పందేరాలు అని అనుకోవలసి వస్తోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/supreme-court-serious-on-ap-ndrf-funds-diversion-39-134375.html





