హెచ్ 1 బీ వీసా.. లక్ష డాలర్ల ఫీజు రద్దుపై స్టే
Publish Date:Jun 16, 2026
Advertisement
అమెరికాలో ఐటీ కొలువు సాధించాలనే కలలు కనే భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులకు, వారిని నియమించుకునే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఊహించని షాక్ తగిలింది. తీవ్ర వివాదాస్పదమైన లక్ష డాలర్ల హెచ్ 1బీ వీసా ఫీజును రద్దు చేస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకే.. అదే కోర్టు తన పాత నిర్ణయంపై స్టే విధిస్తూ.. ఈ ఫీజును పునరుద్ధరించింది. ఈ సంచలన నిర్ణయంతో అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ అయిన యూఎస్‌సీఐఎస్ కు మళ్లీ ఆ భారీ మొత్తాన్ని వసూలు చేసేందుకు మార్గం సుగమమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రత్యేక కేటగిరీల కింద దాఖలు చేసే హెచ్-1బీ వీసా పిటిషన్ల కోసం లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అసాధారణమైన నిర్ణయం టెక్ కంపెనీలపై మోయలేని పెను భారంగా మారిందని, వారి వ్యాపార, నియామక ప్రణాళికలను దెబ్బతీస్తోందని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 8వ తేదీన మసాచుసెట్స్ జిల్లా కోర్టు ఈ వివాదాస్పద ఫీజును పూర్తిగా కొట్టివేస్తూ కీలకమైన తీర్పును వెలువరించింది. జూన్ 8 నాటి తీర్పులో లక్ష డాలర్ల రుసుము అనేది సాధారణ చట్టబద్ధమైన ఫీజు కాదనీ.. ఇది ఒక రకమైన పన్ను రూపంలో ఉందనీ పేర్కొంది. కేవలం అధ్యక్షుడి ఆజ్ఞలు, విచక్షణ అధికారాల ద్వారా ఇలాంటి పన్నును విధించడం పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. అమెరికా వలస చట్టాల పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ (ఏపీఏ) నిబంధనలను కూడా ఈ నూతన విధానం ఉల్లంఘిస్తోందని కోర్టుర తన తీర్పులో పేర్కొంది. అయితే.. మసాచుసెట్స్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమెరికా ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌పై తుది విచారణ పూర్తయ్యే వరకు పాత పద్ధతిలోనే ఫీజు వసూలును కొనసాగించేందుకు అనుమతించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన జిల్లా కోర్టు జూన్ 8న ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చింది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. తాజా కోర్టు ఉత్తర్వుల కారణంగా కాన్సులర్ నోటిఫికేషన్ ద్వారా దాఖలు చేసే కొన్ని ప్రత్యేక హెచ్-1బీ పిటిషన్లకు కంపెనీలు తప్పనిసరిగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందనేది ఇప్పుడు పూర్తిగా అప్పీల్స్ కోర్టు చేతుల్లో ఉంది. ఒకవేళ ప్రభుత్వ స్టే అభ్యర్థనను అప్పీల్స్ కోర్టు అంగీకరిస్తే, సుదీర్ఘకాలం పాటు సాగే ఈ న్యాయపోరాటంముగిసే వరకు కంపెనీలు ఈ ఫీజు భరించక తప్పదు. ఒకవేళ కోర్టు ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తే, జూన్ 8 నాటి తీర్పు మళ్లీ అమల్లోకి వచ్చి ఫీజు రద్దవుతుంది. ప్రభుత్వం తన తుది స్టే అభ్యర్థనను జూన్ 18లోగా అప్పీల్స్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. ఈ నిరంతర న్యాయపరమైన అనిశ్చితి వల్ల అంతర్జాతీయ నియామకాలు మరియు ఐటీ ఉద్యోగాల భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడింది.
http://www.teluguone.com/news/content/stay-on-cancellation-of-one-lac-dollars-fee-36-223042.html





